
కార్మిక వ్యతిరేక విధానాలు తగదు
నగరంలో ప్రదర్శన నిర్వహిస్తున్న సీఐటీయూ నేతలు
నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం నెల్లూరు నగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణ సంఘం నేతృత్వంలో స్టోన్‌హౌస్‌పేట నుంచి గాంధీబొమ్మ వరకు, గ్రామీణ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి వీఆర్సీ వరకు ప్రదర్శనలు సాగాయి. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కార్మికులను కార్పొరేటు సంస్థలు బానిసలుగా మార్చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం రూపొందించిన చీకటి చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఇప్పటి వరకు 20 సమ్మెలు చేశామని, ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీరాములు, టీవీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.