
అర్ధరాత్రి ఆకలి కేకలు
జాతీయ రహదారిపై వాహనాల బారులు
భోజనం, తాగునీటికి ప్రయాణికుల కటకట
సంతోషంగా సాగిన ప్రయాణం.. మరికొన్ని గంటల్లోనే గమ్యస్థానాలు చేరుకుంటామన్న ఆనందం.. క్షణాల వ్యవధిలోనే తీవ్ర నిరాశను మిగిల్చింది. అనూహ్యంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌తో గంటల కొద్ది నడిరోడ్డుపై జోరువానలో జాగారం చేయాల్సివచ్చింది. మనుబోలు - గూడూరు మధ్య ఆదిశంకర కళాశాల వద్ద జాతీయ రహదారిపై భారీగా వరదనీరు పోటెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. నీటి ప్రవాహం దృష్ట్యా పోలీసులు రహదారిపై ఎక్కడికక్కడే నిలిపివేశారు. బూదనం, వెంకటాచలం టోల్‌ప్లాజాల వద్ద బారులుదీరాయి. రోడ్డుకిరువైపులా ఇదే పరిస్థితి ఏర్పడింది. తాగునీరు, భోజనం కోసం అల్లాడిపోయారు. పసిపిల్లలు పాలుదొరక్క నరకయాతన పడ్డారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధులు చలిగాలులకు వణికిపోయారు. చివరకు మనుబోలు - వెంకటాచలం వద్ద బస్షెల్టర్లు, పాఠశాలల వద్దకు వరుసకట్టారు. కావలి నుంచి తడ వరకు ఇదే పరిస్థితి కనిపించింది. కొందరు వెనక్కి వచ్చేందుకు వీలుకాకపోవడంతో కాలికి పనిచెప్పారు. 2015 తరువాత ఐదేళ్లకు అదే ప్రదేశంలో, అదే తరహా పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.