close

సోమవారం, అక్టోబర్ 26, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గిరి.. కన్నీటి తడి

అశ్రునయనాలతో ఎంపీ దుర్గాప్రసాద్‌ అంత్యక్రియలు

గంటన్నర సాగిన అంతిమయాత్ర


అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు, ప్రజలు

వెంకటగిరి, న్యూస్‌టుడే: నవ్వుతూ.. నవ్విస్తూ.. అందరితో కలుపుగోలుగా ఉంటూ.. రాజకీయాల్లో తనదైన పంథాతో ముందుకు సాగి ప్రజల మన్ననలు పొందిన తమ నాయకుడు ఇక లేరన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొండంత బాధను గుండెల్లో దాచుకొని ఆయన రాజకీయ విజయాలను, వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని కొనియాడుతూ గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధికారులు అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు చెన్నై నుంచి ఆయన భౌతికకాయాన్ని గురువారం వేకువజామున వెంకటగిరికి తీసుకువచ్చారు. ఇక్కడ వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రుల సందర్శన నిమిత్తం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మడకశిర ఇన్‌ఛార్జి కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధనుంజయరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళితోపాటు స్థానిక నాయకులు డిల్లీబాబు, హరికృష్ణ, కోటేశ్వరరావు, తెదేపా పుర మాజీ ఉపాధ్యక్షుడు బీరం రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు.

కన్నీటి సంద్రం

దుర్గాప్రసాద్‌ పార్థివదేహం వద్ద ఆయన సతీమణి సరళమ్మ రోదిస్తూనే ఉన్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఇద్దరు కుమారులు, కుమార్తెను పలువురు పరామర్శించి ఓదార్చారు.

గంటన్నర సేపు... స్థానిక కర్ణకమ్మ వీధిలోని ఎంపీ నివాసం నుంచి క్రాస్‌రోడ్డు వరకు సాగిన అంతిమయాత్ర దాదాపు గంటన్నరసేపు సాగింది. ప్రత్యేక రథంపై ఎంపీ పార్థివదేహం ఉంచి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అమ్మవారిపేట చెరువు సమీపంలో అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులు గౌరవ సూచికంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎంపీ భౌతికకాయం వద్ద జిల్లా పరిపాలనాధికారి చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఖననం చేశారు.

పలువురి పరామర్శ..

ఎంపీ కుమారుడు కల్యాణ చక్రవర్తిని హిమాచల్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయకల్లం, రాజసభ్య సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్‌, గౌతమ్‌రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, వరప్రసాద్‌, తదితరులు చరవాణిలో పరామర్శించారు. మాజీ కేంద్ర మంత్రి పనాబాక లక్ష్మి, మాజీ డీసీసీ అధ్యక్షుడు పనాబాక క్రిష్ణయ్యలు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.


నివాళులర్పిస్తున్న ఎస్పీభాస్కర్‌భూషణ్‌, చిత్రంలో కలెక్టర్‌ చక్రధర్‌ బాబు

భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న సరళమ్మ

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.