ఉత్కంఠగా తుర్కపల్లి తెరాస మండల కమిటీ ఎన్నిక
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

ఉత్కంఠగా తుర్కపల్లి తెరాస మండల కమిటీ ఎన్నిక

కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఆందోళన

డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపై కుర్చీలు విసిరిన కార్యకర్తలు

తుర్కపల్లిలో డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఉన్న వేదికపైకి కార్యకర్తలు విసిరిన కుర్చీ

తుర్కపల్లి, న్యూస్‌టుడే: నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌, టెస్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన తెరాస మండల ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్ష పీఠం కోసం పది మంది పోటీ పడగా శనివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ప్రస్తుత అద్యక్షుడు పడాల శ్రీనివాస్‌, డీసీసీబీ మాజీ డైరెక్టరు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి మధ్య పోటీ ఏర్పడింది. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే మెజార్టీ అభిప్రాయం మేరకు నరేందర్‌రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నిక చేస్తున్నట్లు డీసీసీబీ ఛైర్మన్‌ ప్రకటించారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని స్వార్థ రాజకీయాల కోసం అధ్యక్ష పీఠం మరెవరికో ఎలా కట్టపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు రావటానికి ఎంతో కృషి చేసిన వ్యక్తికి అన్యాయం చేయడం దారుణమని నినదించారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆగ్రహించారు.

కుర్చీలు, రాళ్లు విసిరిన కార్యకర్తలు.. అధ్యక్షుడిగా నరేందర్‌రెడ్డి ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రస్తుత అధ్యక్షుడి అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్టేజీ మీద ఉన్న నాయకులపైకి కుర్చీలు విసిరారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగించుకోవాలని అందరూ సంయమనం పాటించాలని పడాల శ్రీనివాస్‌ కార్యకర్తలకు నచ్చజెప్పి వారించారు. క్రమశిక్షణతో ఉండాలని కోరినా డీసీసీబీ ఛైర్మన్‌ పైకి కుర్చీలు విసిరారు. ఆయన కిందకి దిగి వెళ్తుండగా చుట్టుముట్టారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం చేయడం తగదని ఆగ్రహించారు. ఆయన కారుకు అడ్డంగా నిల్చున్నారు. గుర్తు తెలియని కార్యకర్తలు డీసీసీబీ ఛైర్మన్‌ కారుపై మట్టి పోశారు. కారు అద్దం పగుల కొట్టారు. పనిచేసే వారిని పక్కన పెడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పోలీసులు కార్యకర్తలను పక్కకు జరపటంతో ఛైర్మన్‌ వెళ్లిపోయారు. తెరాస కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లి తెలంగాణతల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. భువనగిరి-గజ్వేల్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధిష్ఠానాన్ని గౌరవించి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పడాల శ్రీనివాస్‌ సూచించటంతో ఆందోళన విరమించి కార్యకర్తలు, నాయకులు వెళ్లిపోయారు. ఈ మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని