ప్రభుత్వమే దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలి: జూలకంటి
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

ప్రభుత్వమే దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలి: జూలకంటి

గుడుగుంట్లపాలెంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. గుడుగుంట్లపాలెంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొడ్డు ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అస్పష్టంగా, రైతులను గందరగోళం పరిచే విధంగా ఉన్నాయని విమర్శించారు. నేల స్వభావం రీత్యా సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో వరి మినహా వేరే పంటలు సాగు చేయటానికి అవకాశం లేదన్నారు. ఎఫ్‌సీఐ వద్ద 60 లక్షల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని ప్రకటించిన ప్రభుత్వం దేశంలో ఆకలి చావులు ఎందుకు నమోదవుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణం బియ్యం నిల్వలను పేదలకు పంచి, రానున్న యాసంగిలో లభ్యం కానున్న దొడ్డు రకం బియ్యాన్ని అవసరమైతే ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని సూచించారు. పార్‌బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడితే వేల మంది కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతు సంక్షేమ బాధ్యతల నుంచి తప్పించుకోవాలి అని చూస్తే సీపీఎం ఊరుకోదని స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు దేశంలోని 19 రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం, నిరసనలు, చేపట్టి 27వ తేదీన భారత్‌ బంద్‌ను చేపట్టన్నుట్లు తెలిపారు. మండల కార్యదర్శి అనంతప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యుడు వెంకటయ్య, కృష్ణారెడ్డి, పురుషోత్తమ్‌రెడ్డి, నందయ్య, జనార్దన్‌రెడ్డి, విజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని