మట్టి నింపారు.. వదిలేశారు
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

మట్టి నింపారు.. వదిలేశారు

పుర నర్సరీపై నిర్లక్ష్యం... రూ.లక్షలు మట్టిపాలు

నకిరేకల్‌ పద్మానగర్‌ బైపాస్‌ కూడలి సమీపంలోని నర్సరీలో

సంచుల్లో మట్టినింపి వదిలేసిన దృశ్యం

నకిరేకల్‌, న్యూస్‌టుడే: హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. నకిరేకల్‌ పురపాలిక ఆధ్వర్యంలో నర్సరీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎలాంటి ముందుచూపు లేకుండా హడావుడిగా నర్సరీని ఏర్పాటు చేసిన అధికారులు రూ.లక్షల్లో ప్రజాధనాన్ని మట్టిపాలు చేశారు. 2020-21 సంవత్సరానికి నకిరేకల్‌ పురపాలిక పరిధిలో నర్సరీ ఏర్పాటుచేసి 1.50 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. స్థానిక శివారు పద్మానగర్‌ బైపాస్‌ కూడలి సమీపంలోని పుర స్థలంలో నర్సరీని ఏర్పాటు చేశారు. లక్ష సంచులు తెప్పించి వాటిల్లో మట్టిని నింపారు. ఆరునెలలుగా వాటిల్లో విత్తనాలు నాటకపోవడంతో ఈ సంచులు మట్టిలో కలిసిపోతున్నాయి. ముందుగా నీటి వసతికి ఏర్పాట్లు చేయకుండానే నర్సరీని మొదలు పెట్టారు. విత్తనాలు నాటని, మొక్కలు పెరగని ఈ నర్సరీ కోసం రూ.5 లక్షల వరకు వ్యయం చేసినట్లు దస్త్రాల్లో చూపుతున్నారు. నర్సరీని వృథాగాపెట్టి ఇటీవల హరితహారం కింద రూ.8.62 లక్షలతో 17,500 మొక్కలు ప్రైవేట్‌ నర్సరీల నుంచి కొనుగోలు చేశారు. నర్సరీపై శ్రద్ధపెట్టి మొక్కలు పెంచితే ప్రజాధనం మట్టిపాలు అయ్యేది కాదని పలువురు పేర్కొంటున్నారు.

విద్యుత్తు సౌకర్యం లేకనే

-ఎన్‌.బాలాజీ, పుర కమిషనర్‌, నకిరేకల్‌

అద్దెకు తీసుకున్న బోరుకు విద్యుత్తు సదుపాయం లేదు. రూ.2 లక్షల వ్యయమవుతుందని విద్యుత్‌ శాఖ ప్రతిపాదించింది. నీటి వసతి కల్పించి నర్సరీని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని