నిర్విఘ్నంగా నిమజ్జనానికి..
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

నిర్విఘ్నంగా నిమజ్జనానికి..

చెరువులు, కాల్వల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

నల్గొండ పాతబస్తీలో గణేశ్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు

నల్గొండ నేరవిభాగం, నల్గొండ సంక్షేమం, నాంపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గణేశ్‌ నిమజ్జనానికి పోలీస్‌ యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతి విగ్రహానికి ఇప్పటికే జియోటాగ్‌ చేసిన పోలీసులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా వినాయక నిమజ్జనం అంతగా జరుపుకోని యువత ఈ సారి ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో జరుపుకోవాలన్న జోష్‌లో ఉన్నారు. ముందస్తుగా శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ అధికారులు బంద్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యతలను ఆయా జిల్లాల పోలీసు అధికారులు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా భారీగా పోలీసులను మొహరిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

జిల్లా కేంద్రాలతో పాటు నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేసిన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు, విద్యుత్తు దీపాలు, క్రేన్‌లు ఇతర వసతులు సిద్ధం చేశారు. అధికారులు నిర్ణయించిన ప్రాంతాలు కాకుండా కొంత మంది యువత నాగార్జున సాగర్‌, పాలేరు, మూసీ, మేములపల్లి కాలువ, వాడపల్లి, శ్రీశైలం, వంటి ప్రాంతాలతో పాటు నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తున్న కాలువల్లో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో రక్షణ వలయాలు లేని కారణంగా ఈత రాని చిన్నారులు, యువత ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, ఆలేరు, నల్గొండలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఆయా జిల్లా కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణ చేస్తారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

నల్గొండ సంక్షేమం, హాలియా : గణేశ్‌ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ తెలిపారు. శనివారం నల్గొండ పట్టణంలో గణేశ్‌ నిమజ్జనం చేసే వల్లభరావు చెరువు, నిడమనూరు సమీపంలోని 14వ మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బది లేకుండా క్రేన్లు, ఫ్లడ్‌లైట్లు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యుత్తు శాఖ నిరంతరం కరెంట్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. 14వ మైలురాయి వద్ద పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు నిమజ్జనం జరుగుతున్నందున ఆర్‌డీవోలు, డీఎస్పీలు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలన్నారు. పటిష్ఠ బందోబస్తుతో పాటు సమయాన్ని పాటిస్తూ మండపాల నిర్వాహకులు నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యుత్తు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, పంచాయతీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయడంతో పాటు, ప్రతి ఒక్కరు ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా జిల్లా యంత్రాంగంతో సహకరించాలని కోరారు. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌, నల్గొండ, మిర్యాలగూడ ఆర్‌డీవోలు రోహిత్‌సింగ్‌, జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, నల్గొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఇన్‌ఛార్జి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, హాలియా మున్సిపల్‌ కమిషనర్‌ వేమారెడ్డి సీఐలు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉంటేనే మేలు

విద్యుత్తు తీగలతో..

నిమజ్జనం వేళ విగ్రహాల ఊరేగింపు సమయంలో దారిలో విద్యుత్తు తీగలు అడ్డుగా వస్తాయి. వీటిని తప్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఉత్సవ కమిటీ సభ్యుల్లో కొందరికి బాధ్యతలు అప్పగించాలి. వీలైతే నిమజ్జనానికి ముందుగా దారిలో వదులు తీగలు ఎక్కడ ఉన్నాయి.. ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని ఆరా తీయాలి. తీగలు అడ్డుగా ఉన్నచోట వాటిని పైకి ఎత్తేందుకు బాగా ఎండిన కర్రను ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తీగలను చేతులతో తాకరాదు.

నల్గొండలో గణపతి నిమజ్జనం చేసే వల్లభరావు చెరువును పరిశీలించి

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ ఏ.వి.రంగనాథ్‌

వంతెనలు, చెరువులు, కుంటల వద్ధ.

ఉమ్మడి జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వంతెనల వద్ద వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల గతంలోకంటే నీరు పుష్కలంగా ఉంది. నిమజ్జన సమయంలో వంతెనల పైనుంచి కొందరు విగ్రహాలను నీటిలోకి జార విడుస్తుంటారు. ఈసమయంలో పట్టు తప్పితే నీటిలో పడే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంది. ఇక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలతో చెరువు, కుంట కట్టలు గట్టిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి.

నల్గొండ జిల్లాలో...

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఐదు ఫీట్లలోపు ఉన్న వాటిని నార్కట్‌పల్లి - అద్దంకి రోడ్డు పానగల్‌ ప్రాంతంలో ఉన్న వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఐదు ఫీట్లకు పైన ఉన్న విగ్రహాలు 14వ మైలు రాయి వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన విగ్రహాలు వేములపల్లి ప్రాంతంలో, దేవరకొండ ప్రాంతానికి చెందిన విగ్రహాలు డిండి, కొండ బీమనపల్లి ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని