హామీలు అమలయ్యేలా.. సమస్యలు పరిష్కారమయ్యేలా
eenadu telugu news
Published : 30/07/2021 05:29 IST

హామీలు అమలయ్యేలా.. సమస్యలు పరిష్కారమయ్యేలా

● హాలియాలో సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు

ఈనాడు, నల్గొండ

ఐటీఐ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భగత్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో ఆగస్టు 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ఖరారు కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభ జరిగే పాలిటెక్నిక్‌ కళాశాల మైదానాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం సభా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తప్ప మిగతా వారికి ఈ సభకు అనుమతి లేదని తెలిసింది. ఆరు వేల మందితో సభా ఏర్పాట్లను చేయాలని అధికారులు నిర్ణయించారు. సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, ప్రస్తుతం ఆ పనుల పరిస్థితి తెలిపే ప్రగతి నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నెల్లికల్‌తో పాటు కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేసిన 13 ఎత్తిపోతల పథకాలను దాదాపు రూ.2500 కోట్లతో నిర్మిస్తుండటంతో ప్రధానంగా ఆయన వీటిపైనే అధికారులకు దిశానిర్దేశం చేస్తారని ముఖ్య నాయకుడొకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. ఉప ఎన్నిక సమయంలో సాగర్‌ నియోజకవర్గ ప్రజలు ఏళ్లుగా కలలుగన్న నెల్లికల్‌ ఎత్తిపోతలను ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ ఎత్తిపోతలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అన్ని ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే టెండర్లు ఖరారు కాగా.. సీఎం కేసీఆర్‌ సభ అనంతరం పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. జిల్లాలోని పురపాలికలు, పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒకట్రెండు రోజుల్లో ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమీక్ష సమావేశ స్థలం పరిశీలన

హాలియా, న్యూస్‌టుడే: ఆగస్టు 2న నాగార్జునసాగర్‌ నియోజవర్గంలో హామీల అమలు.. సమస్యలపై సర్పంచి స్థాయి నుంచి సమీక్ష జరిపి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. గురువారం హాలియాలో సీఎం కేసీఆర్‌ నిర్వహించనున్న సమీక్ష సమావేశం స్థలం ఐటీఐ భవనం దాని సమీపంలో హెలిపాడ్‌, వ్యవసాయ మార్కెట్‌ యార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూఅభివృద్ధి కార్యక్రమాలు పల్లె, పట్టణ ప్రగతి, దీర్ఘకాలిక సమస్యలపై సర్పంచి, వార్డు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, అధికారులతో సమీక్షించి సలహాలు, సూచలనలపై దిశానిర్దేశం చేస్తారన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎస్పీ ఏవీ రంగనాథ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గోదావరి - కృష్ణా అనుసంధానంపైనా చర్చ

కృష్ణా నదిలో నీటి లభ్యత లేని సమయంలో గోదావరి నుంచి నీళ్లను మళ్లించి సాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్న రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లందించేలా అధికారులు ప్రణాళికలు రచించారు. రూ.600 కోట్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామా ప్రాజెక్టు నుంచి పాలేరు రిజర్వాయర్‌ ద్వారా ఎడమ కాల్వలోకి నీటిని ఎత్తిపోస్తూ పెద్దదేవుల పల్లి చెరువును నింపేందుకు అప్పట్లోనే విశ్రాంత ఇంజినీర్లతో కలిసి అధికారులు డీపీఆర్‌ తయారు చేశారు. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అతి తుది దశకు చేరలేదు. సమావేశంలో ఈ ప్రతిపాదనపైనా ఇంజినీర్లతో చర్చించనున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు విశ్రాంత ఇంజినీర్లతో కలిసి ఈ ప్రతిపాదనపై ఒక నివేదిక తయారు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీన్ని సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని