Published : 21/04/2021 03:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి

కూలీకి వెళ్లి వస్తుండగా ఏపీ పరిధిలో ట్రాలీ బోల్తా
మిర్యాలగూడ మండల పరిధిలోని తండాలో విషాదం

మిర్యాలగూడ గ్రామీణం, దాచేపల్లి, న్యూస్‌టుడే: వాహనచోదకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం కారణంగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండల పరిధిలోని గద్దగుండుతండాకు చెందిన 40 మంది కూలీలు 35 రోజుల నుంచి ఏపీలోని గురజాల మండలం పులిపాడుకి మిరపకాయ కోసేందుకు వెళ్తున్నారు. వీరిని రోజూ తన ట్రాలీ ఆటోలో తీసుకెళ్లేందుకు దామరచర్ల మండలం బండావత్‌తండాకు చెందిన వంశీ ఒప్పందం కుదుర్చుకున్నారు.

రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం 6 గంటలకు కూళ్లకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో డ్రైవర్‌ వంశీ ఫోన్‌ చూస్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో రూపావత్‌ లింగానాయక్‌(57), ఇతని మేనల్లుడు బర్మావత్‌ సాయి(24) మృతి చెందారు. రూపావత్‌ మంగ్యా(60), రూపావత్‌ దేవి(14)కి తీవ్రంగా, మరో 15మంది స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లింగా, సాయి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రిలో ఉంచారు. బాధితులు అందరూ సమీప బంధువులు కావడంతో ఆసుపత్రి వద్ద రోదనలతో మిన్నంటాయి. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. మార్కెట్‌ ఛైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచి వీరారెడ్డి, తదితరులు ఉన్నారు.
ఆసరా దూరమాయే..
ఇద్దరు కుమారులు చిన్నగున్నప్పుడే మనస్పర్థలతో భర్తతో విడిపోయిన సక్కి.. సొంతతండాకు వచ్చి చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటుంది. పెద్ద కుమారుడు డ్రైవరుగా పని చేస్తుండగా.. చిన్న కొడుకు సాయి, సొంత అన్న లింగాతో కలిసి రోజూ కూళ్లకు వెళ్తోంది. ఈ దుర్ఘటనలో కళ్ల ఎదుటే ఆసరా ఉన్న ఇద్దరూ మృత్యువాతపడడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని