దుబ్బాకలో గొర్రెల కాపరి..
eenadu telugu news
Updated : 30/07/2021 02:10 IST

దుబ్బాకలో గొర్రెల కాపరి..

దుబ్బాక, న్యూస్‌టుడే: గొర్రెలను కాస్తూ జీవనం సాగించే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన దుబ్బాక పురపాలిక దుంపలపల్లి 5వ వార్డులో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాలు.. దుంపలపల్లికి చెందిన దొందడి రెడ్డయ్య(48)కు భార్య తిరుపతమ్మ, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. మూడు రోజుల క్రితం పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి వెళ్లింది. రెడ్డయ్య ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. బుధవారం రాత్రి అతను ఇంటి వద్ద గొర్రెలు ఉంచి 7 గంటలకు బయటకు వెళ్లాడు. గురువారం ఉదయం దుంపలపల్లి-ధర్మారం మట్టి దారిలో తీవ్రగాయాలతో శవమై స్థానికులకు కనిపించాడు. కుటుంబీకులు, పోలీసులకు సమాచారం తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలను సేకరించారు. ఏసీపీ సైదులు మాట్లాడుతూ ఇంటి నుంచి రాత్రి ఇద్దరు వ్యక్తులతో అతను బయటకొచ్చాడని, ఘటనాస్థలిలో వారితో మద్యం తాగాడని తెలుస్తోందన్నారు. మృతుడి మెడపై తాడుతో ఉరివేసినట్లుగా, ముఖంపై తీవ్రంగా కొట్టినట్టుగా కనిపిస్తోందన్నారు. దర్యాప్తు చేసి త్వరలో నిందితులను పట్టుకున్నామని చెప్పారు. రెడ్డయ్య సోదరుడు పరశురాములు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దుంపలపల్లిలో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ముందు శవాన్ని ఉంచి గ్రామస్థులు, బంధువులు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. హతుడి భార్యను కొందరు తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

గ్రామస్థుల ఆందోళన

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని