అడుగుకో గుంత.. ప్రమాదాల చింత! 
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

అడుగుకో గుంత.. ప్రమాదాల చింత! 

కేజీ రోడ్డు నిర్వహణ మరిచిన అధికారులు

వాహనదారులకు ఇక్కట్లు


అమలాపురం గ్రామం వద్ద రోడ్డు దుస్థితి

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు : అది జాతీయ రహదారిగా మారిందే కానీ రోడ్డు రాత మారలేదు. నిత్యం ప్రమాదాలతో వాహన చోదకులకు వ్యథ తప్పడం లేదు. అడుగుకో గుంత ఉండటంతో బెంబేలెత్తుతున్నారు. వర్షాకాలం కావడంతో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీళ్లు నిలిచి లోతు అంచనా వేయలేక వాహనాలు అదుపు తప్పుతున్నాయి. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’ క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

కర్నూలు-గుంటూరు (కేజీ) రోడ్డుగా పిలిచే రహదారి రూపు మారడం లేదు. ఎన్‌హెచ్‌ - 340 సి రోడ్డు అడుగడుగునా గుంతలతో దర్శనమిస్తోంది. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, కృష్ణాపురం, వెంకటాపురం గ్రామాల వద్ద నడి రోడ్డుపై భారీ గోతులు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా అడపాదడపా పడుతున్న వర్షాలకు ఈ గుంతల్లో నీళ్లు నిలిచాయి. లోతు ఎక్కువగా ఉండటంతో గుర్తించని వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలబారిన పడుతున్నాయి. లోడు లారీలైతే గుంతలు దాటించేందుకు వాహనచోదకులు అష్టకష్టాలు పడుతున్నారు.

ప్రతినిత్యం కష్టాలే..

పిన్నాపురం సచివాలయం సమీపంలో రహదారి మధ్యలో రెండు అడుగుల లోతు మేర భారీ గుంతలు ఏర్పడ్డాయి. వారం రోజుల కిందట ఓ ద్విచక్రవాహన చోదకుడు ఈ గుంతలో దిగి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా వచ్చాయి. కారు రోడ్డు పక్కన గుంతల్లో దిగి అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లింది. అమలాపురం గ్రామం వద్ద ఓ భారీ గుంతలో ఆటో బోల్తా కొట్టిందని, అదృష్టవశాత్తూ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని గ్రామస్థులు తెలిపారు. ఇలా గడిచిన నెల రోజుల వ్యవధిలో 16 వాహనాలు అదుపు తప్పాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది.

రోజూ వాహనాల రద్దీ ఇలా...

ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు: 120

కార్లు, ఆటోలు: 600

లోడు లారీలు: 300

ద్విచక్ర వాహనాలు: 250

కానరాని నిర్వహణ

రాష్ట్రీయ రహదారిగా ఉన్న కేజీ రోడ్డు జాతీయ రహదారిగా మారినప్పటికీ అందుకు తగ్గ సదుపాయాల కల్పన కానరావడం లేదు. సమస్యను అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోతోంది. ప్రస్తుతం రహదారి నిర్వహణకు సంబంధించి కేవలం రూ.5 లక్షలు కేటాయించారు. వీటికి టెండర్లు పిలవాల్సి ఉంది. ఉగాది, శివరాత్రి సమయాల్లో నిర్వహణ పేరుతో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప ఫలితం ఉండటం లేదు. దీనికి కారణం పనులు దక్కించుకున్న గుత్తేదారు శ్రీశైలం ప్రధాన కాల్వ, బనకచర్ల, పోతిరెడ్డిపాడు వద్దనున్న రాళ్లతో కూడిన మట్టిని తెచ్చి మమ అనిపిస్తున్నారు.

రూ.1.71 కోట్లు కేటాయింపు

నందికొట్కూరు నుంచి గుంతల పడిన ప్రదేశాల్లో మరమ్మతులు చేసేందుకు రూ.1.71 కోట్లతో ప్రతిపాదనలు పంపగా మంజూరయ్యాయి. ఈ నిధులతో సీఈ స్థాయిలో ఆన్‌లైన్‌ టెండర్లు పిలిస్తున్నారు. ఇప్పటికే జూపాడుబంగ్లా, తంగడంచె చెక్‌పోస్టు సమీపంలో 150 మీటర్ల మేర రోడ్డు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. నందికొట్కూరు, రబ్బాని గోదాం రెండు చోట్ల 200 మీటర్ల మేర రోడ్డు దెబ్బతింది. కరివేన సమీపంలో 50 మీటర్లు, కృష్ణాపురం, వెంకటాపురంలో కొన్ని చోట్ల రహదారి రూపు కోల్పోయింది. వీటికి మరమ్మతులు చేసేందుకు ఏజెన్సీ ఎంపిక చేయలేదు. వాస్తవానికి ఈ పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదన్న వాదన వినిపిస్తోంది.

దెబ్బతిన్న చోట్ల పనులు చేయిస్తాం - ఇందిర, ఏపీఆర్డీసీ ఈఈ

ఎన్‌హెచ్‌కు వచ్చిన నిర్వహణ నిధులతోనైనా కృష్ణాపురం, వెంకటాపురం గ్రామాల వద్ద వెంటనే మరమ్మతులు చేపడతాం. రూ.1.71 కోట్లతో కర్నూలు-గుంటూరు మార్గంలో ఎక్కడైతే దెబ్బతిందో అక్కడ మరమ్మతులు ప్రారంభించాం. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఎల్‌వోఏ ఇచ్చేందుకు ముందే మిగిలిన పనులు ప్రారంభించాలని గుత్తేదారులను కోరాం.

అదుపు తప్పి అడవిలోకి దూసుకెళ్లిన వాహనం

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని