విడతలవారీగా ట్రిపుల్‌ ఐటీ తరగతులు
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

విడతలవారీగా ట్రిపుల్‌ ఐటీ తరగతులు

● కొత్త కోర్సులకు శ్రీకారం ●

వచ్చే ఏడాదికల్లా భవన నిర్మాణాలు పూర్తి ●

డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సోమయాజులు

ప్రొఫెసర్‌ డీవీఎల్‌ఎన్‌ సోమయాజులు

ఈటీవీ కర్నూలు : కరోనా కారణంగా కర్నూలు ట్రిపుల్‌ ఐటీ (డీఎం)లో తరగతులు ఆలస్యమవుతున్నాయి. త్వరలో క్యాంపస్‌లో విడతలవారీగా తరగతులు ప్రారంభిస్తాం. కొవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తున్నామని ట్రిపుల్‌ ఐటీ (డీఎం) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీవీఎల్‌ఎన్‌ సోమయాజులు తెలిపారు. నూతన విద్యా విధానాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు.

కొవిడ్‌-19 ప్రారంభమైనప్పటి నుంచి క్యాంపస్‌లో తరగతులు జరగలేదు. అధ్యాపకులు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ల్యాబొరేటరీల్లో ప్రాక్టికల్స్‌కు వీలుకావటం లేదు. విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చాక ఎక్కువ సమయం కేటాయించి ప్రాక్టికల్స్‌లో శిక్షణ ఇస్తాం.

ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ, ఎంటెక్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ ఆఫర్‌ చేస్తున్నాం. పీహెచ్‌డీ ప్రోగ్రాంకు సంబంధించి అడ్మిషన్లు పూర్తి చేశాం. 20 మంది పీహెచ్‌డీ స్కాలర్లను ఎంపిక చేశాం. జాతీయస్థాయిలో అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా గేట్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి ఎంటెక్‌లో అడ్మిషన్లు ఇస్తాం.

ప్రస్తుతం క్యాంపస్‌కు వచ్చే విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఉన్నాయి. రెండు హాస్టళ్లు, ఒక మెస్‌ ఉంది. 350 మంది విద్యార్థులకు వసతి సదుపాయం ఉంది. విద్యార్థుల సంఖ్య ఆరు వందల వరకు ఉంది. గతేడాదే భవన నిర్మాణాలు ప్రారంభంకావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం పనులు మొదలయ్యాయి. డిసెంబర్‌ 2022 నాటికి అన్ని పనులు పూర్తవుతాయి.

ప్రస్తుతానికి అధ్యాపకుల కొరత లేదు. 31 పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటికే 21 మంది ఉన్నారు. మరో పది పోస్టులకు ప్రకటన ఇచ్చాం. త్వరలో వారిని తీసుకుంటాం. వీరుకాక మరో 10 మంది పరిశ్రమలకు చెందిన నిపుణులను తీసుకొచ్చి వారితోనూ పాఠాలు చెప్పిస్తాం.

నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) మంచిదే. ఎన్‌ఈపీ ద్వారా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఒక చిన్న ప్రోగ్రాం ప్రారంభించాం. దీనిద్వారా ఏ శాఖ విద్యార్థులైనా ఈ కోర్సులు తీసుకోవచ్ఛు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సు సైతం ప్రారంభించాం. ఈ కోర్సు కోసం అడ్మిషన్లు గతేడాదే మొదలు పెట్టాం. అన్ని సీట్లు పూర్తయ్యాయి. ఈసారి సీట్ల సంఖ్య పెంచాం. గతేడాది బీటెక్‌లో 180 సీట్లు ఉంటే ఈసారి 240 చేశాం. అన్ని బ్రాంచీల కోర్సులు, కరిక్యులమ్‌ డిజైన్‌ చేశాం. ఇదికాక అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ అనే కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టాం.

ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాం. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత విడతల వారీగా విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. సెప్టెంబర్‌ చివరి వారానికి విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని