అంతా శుద్ధిమాటలే!
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

అంతా శుద్ధిమాటలే!

● ఫిల్టర్‌ బెడ్లపై పర్యవేక్షణ కరవు

● వెంటాడుతున్న సిబ్బంది కొరత


ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి ఫిల్టర్‌ బెడ్‌కు చేరుతున్న నీరు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: సీజనల్‌ వ్యాధులు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న వేళ తాగునీటి సరఫరాపై నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా ప్రజలకు సరఫరా చేసే రక్షిత నీరు సురక్షితమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు అవసరమైన సిబ్బంది లేకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఎంత నీటిలో ఏఏ రసాయనాలు కలపాలి? అనే విషయంపై కొందరికి సరైన అవగాహన లేకపోవడంతో తూతూ మంత్రంగా నీటి శుద్ధి సాగుతోంది.

నంద్యాల పట్టణానికి తాగునీరు సరఫరా చేసేందుకు రెండు ఎస్‌ఎస్‌ ట్యాంకులున్నాయి. చిన్న చెరువు వెనుక వైపు ఉన్న పురపాలక వాటర్‌ వర్క్స్‌ ట్యాంకు సామర్థ్యం 900 మిలియన్‌ లీటర్లు కాగా.. ఎస్‌ఎస్‌ ట్యాంకు సామర్థ్యం 1800 మిలియన్‌ లీటర్లు. రెండు ట్యాంకులకు కేసీ కెనాల్‌ నుంచి వచ్చిన నీళ్లు అక్కడే సహజ సిద్ధంగా కొంత వరకూ శుభ్రం అవుతాయి. చిన్నచెరువు వద్ద ఏర్పాటుచేసిన ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా రోజుకు 15 మిలియన్‌ లీటర్ల శుద్ధి జరుగుతుండగా.. ఎస్‌ఎస్‌ ట్యాంకు ద్వారా వచ్చే నీళ్లు ఆత్మకూరు బస్టాండు ఫిల్టర్‌బెడ్ల ద్వారా శుద్ధి చేస్తున్నారు. కానీ రెండు చోట్ల జరుగుతున్నా ఎక్కడా సరైన సాంకేతిక సిబ్బంది కానీ.. నిపుణులు కానీ లేకపోవడం గమనార్హం. ఇది ప్రజారోగ్యంపై ప్రభావం పరోక్షంగా ప్రభావం చూపుతోంది.

నిపుణులు కానరాక..

చిన్న చెరువు ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద ఫిల్టర్‌ బెడ్లు ఉన్నా ప్రయోగశాల లేదు. ఇక్కడ వాటర్‌ అనలిస్టు కాని మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ చేసిన నిపుణులు కానీ లేరు. రూ.5 లక్షల సాధారణ నిధులతో ప్రయోగశాల ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా పురపాలక పాలకవర్గం కానీ, అధికారులు గానీ దృష్టి సారించడం లేదు. ప్రయోగశాలలో నీటిని పరీక్షించి తదనుగుణంగా శుద్ధి జరగాల్సిన పరిస్థితుల్లో.. సాధారణంగా జరిగే ప్రక్రియ ద్వారా నేరుగా ట్యాంకు నుంచి నేరుగా పైపులైన్లకు నీటిని వదులుతున్నారు. నీటి మలినాలను బట్టి ఆలం, ఫ్లోరిన్‌ కలిపి నీటిని శుభ్రం చేసి వదలాల్సి ఉంటుంది. క్లోరినేషన్‌ అనేది ప్రారంభంలో మిలియన్‌ గ్రామ్‌ ఫర్‌ లీటరుగా ఉండాలి. అదే చివర్లో అయితే 0.2 లీటర్లుగా ఉండాలి. కానీ ఇక్కడ సాధారణంగా రోజూ సిబ్బంది చేసే క్లోరినేషన్‌ మలినాలను బట్టి కాకుండా రోజువారీ కార్యక్రమంగా జరిగిపోతుండడం గమనార్హం. శుద్ధి చేసి బయటకు వదిలిన నీళ్లు పైపులైన్‌ లో ఉండగా క్లోరిన్‌ గ్యాస్‌ వదిలి సరిపుచ్చుతున్నారు. ఇదే సమయంలో నంద్యాల ఎస్‌ఎస్‌. ట్యాంకు నుండి వచ్చే నీళ్లు ఆత్మకూరు బస్టాండు ఫిల్టర్‌ బెడ్ల వద్ద శుద్ధి జరుగుతుంది. ఇక్కడ ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వాటర్‌ అనలిస్టు ఉన్నారు. ఇక్కడ సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. రసాయన శాస్త్ర నిపుణుడు అవసరం ఉండగా ఈ పోస్టు దశాబ్ధాల నుంచి ఖాళీగా ఉంది. ల్యాబ్‌ అసిస్టెంట్‌ లేరు.

అన్నింటికి ఆ ప్రయోగశాలే ఆధారం...

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మంచి నీటి పైపులైన్లు మురుగు కాల్వల్లో ఉండిపోయాయి. కొన్ని చోట్ల పైపులైన్లు లీకయి మురుగు కాల్వల నీళ్లు సరఫరా అవుతున్నాయి. పట్టణంలోని వార్డు సచివాలయాల ద్వారా నీటి నమూనాలను కార్యదర్శులు సేకరించి ఆత్మకూరు బస్టాండు ఫిల్టర్‌ బెడ్ల ప్రయోగశాలకు తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా నిపుణులు, సిబ్బంది లేకపోవడంతో ఫలితాలు సక్రమంగా రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు నీటిలో వాడుతున్న క్లోరినేషన్‌ సరిగ్గా ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిల్టర్‌ బెడ్‌ ఆపరేటర్లే యథావిధిగా చేస్తున్న క్లోరినేషన్‌పై శాస్త్రీయత కరవైంది. 2.27 లక్షల జనాభాకు అవసరమైన తాగునీటి సరఫరా పై పర్యవేక్షణ కొరవడింది.

ఫిల్టర్‌ బెడ్ల నిర్వహణకు ఏటా రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం రెండు ఫిల్టర్‌ బెడ్లలో 36 మంది సిబ్బంది ఉన్నారు. మరికొంత మంది అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

క్లోరినేషన్‌ బాగానే జరుగుతోంది- శ్రీనివాసరెడ్డి, డీఈ, నంద్యాల

ఫిల్టర్‌ బెడ్లలో క్లోరినేషన్‌ బాగా జరుగుతోంది. ఎక్కడైనా నీళ్లు మురుగు వాసన వచ్చినా, రంగు మారినా ఫిర్యాదు అందిన వెంటనే నమూనాలు సేకరించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది కొరత ఏమీ లేదు. క్లోరిన్‌ పరీక్షలు సైతం తరచూ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ప్రయోగశాల ఒక్కటే సరిపోతుంది. కొత్తగా ఎటువంటి ప్రతిపాదనలు లేవు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని