మళ్లీ.. ఉల్లి లొల్లి
eenadu telugu news
Published : 17/09/2021 03:56 IST

మళ్లీ.. ఉల్లి లొల్లి

● టెండరుకు నోచుకోని దిగుబడులు

● మొక్కుబడిగా ఈ-నామ్‌ కొనుగోళ్లు


టెండరు వేయలేదని చెబుతున్న రైతు

కర్నూలు నగరం (మార్కెట్‌), న్యూస్‌టుడే: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ‘ఉల్లి’ క్రయ విక్రయాల్లో మరో సమస్య వచ్చింది. యార్డులో గత నెల 27 నుంచి ఈ.నామ్‌ విధానంలో ఉల్లి వ్యాపారం కొనసాగుతోంది. ఈ విధానంలో కొన్ని ఉత్పత్తులకు టెండరు వేయకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోంది. తాజాగా దిగుబడులు తీసుకురావద్దని కమీషన్‌ ఏజెంట్లు పేర్కొనడంతో రైతులు సంశయంలో పడగా ఉల్లి విక్రయాలపై జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దిగుబడులు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు యార్డులో ఈ.నామ్‌లో ఉల్లి విక్రయాలు మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వేలంలో ధర బాగుండేదని, ఈ.నామ్‌లో వ్యాపారులు తక్కువ ధరలు వేయడంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ.నామ్‌ విధానాన్ని వ్యతిరేకించి 15 రోజులపాటు ఉల్లిని కొనుగోలు చేయని వ్యాపారులు తప్పని పరిస్థితుల్లో పాల్గొంటున్నారు. పంట పండిన తర్వాత తమ దుకాణాలకే సరకు తీసుకురావాలనే షరతుపై పలువురు కమీషన్‌ ఏజెంట్లు రైతులకు అప్పులిస్తున్నారు. వాటిని తీర్చేందుకు రైతులు అదే దుకాణాలకు తప్పనిసరిగా సరకు తీసుకెళ్లాల్సిందే. ఇదే తంతు కర్నూలు యార్డులో ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ముందుగా పెట్టుబడి కోసం అప్పు తీసుకున్నందుకు రైతులు తాము తెచ్చిన దిగుబడులను ఏదో ఒక ధరలకు అమ్ముకోవాల్సి వస్తోంది. మరోవైపు ధరలు అంతంతమాత్రంగా పలుకుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

నాణ్యత సరిగా లేదంటూ..

యార్డుకు వచ్చిన ఉల్లిలో నాణ్యత సరిగా లేదని, పచ్చిగా ఉందనే నెపంతో కొందరు వ్యాపారులు తక్కువ ధర వేయడంతోపాటు కొన్నింటికి టెండర్లు వేయడం లేదు. రోజుకు 20-25 క్వింటాళ్ల ఉల్లి టెండరుకు నోచుకోపోవడంతో వాటిని అమ్ముకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. క్వింటా కనీసం రూ.200కు అమ్ముడుపోవడం కష్టంగా ఉందని రైతులు చెబుతున్నారు.

తీసుకురావద్దని చెప్పాం - కట్టా శేఖర్‌, కార్యదర్శి, కమీషన్‌ ఏజెంట్ల సంఘం

ఈ.నామ్‌ విధానంలో కొన్ని లాట్లకు టెండర్లు వేయడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. తక్కువ ధరలతోపాటు కొన్ని లాట్లను పరిగణనలోకి తీసుకోకపోవడంతో శుక్రవారం నుంచి ఉల్లిని తీసుకురావద్దని రైతులకు సూచించాం..

రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తాం -ఆర్‌.జయలక్ష్మి, విపణి కార్యదర్శి

యార్డుకు ఉల్లిని తీసుకురావొద్దని రైతులకు తెలియచేశామనే అంశాన్ని కమీషన్‌ వ్యాపారులు తెలిపారు. వారు తెలిపిన ప్రకారం ఉల్లి క్రయవిక్రయాలు నిలిచిపోవు. యార్డుకు ఉల్లిని తీసుకొచ్చిన రైతులకు గిట్టుబాటు ధరతో ఈ.నామ్‌లోనే అమ్మకాలు జరిగేలా చూస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని