తీర్పు వెల్లడి.. పరిషత్‌ సందడి
eenadu telugu news
Updated : 17/09/2021 04:01 IST

తీర్పు వెల్లడి.. పరిషత్‌ సందడి

● ఓట్ల లెక్కింపునకు కోర్టు పచ్చజెండా ●

సన్నద్ధమవుతున్న జిల్లా అధికారులు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు : రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

స్ట్రాంగ్‌ రూంలలో..

ఎన్నికలు జరిగిన పరిధిలో మొత్తం 15,56,617 ఓటర్లు ఉండగా 9,38,379 ఓట్లు (60.28 శాతం) పోలయ్యాయి. బ్యాలెట్‌ బాక్సులను జిల్లాలో 11 చోట్ల స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఆదోని, మంత్రాలయం, పెద్దకడబూరు, కౌతాళానికి సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు ఉంచారు. ఆలూరు బాలిక ఉన్నత పాఠశాలలో ఆలూరు, హొళగుంద, హాలహర్వి, ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌ యార్డులో దేవనకొండ, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, బనవాసి బాలుర ఉన్నత పాఠశాలల్లోని స్ట్రాంగ్‌ రూంలలో ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్లకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు పెట్టారు. ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లికి సంబంధించిన బాక్సులు, డోన్‌కు సంబంధించి ఎంపీపీ కార్యాలయం, అవుకు ఎంపీపీ కార్యాలయం, కర్నూలు సిల్వర్‌జూబ్లీ కళాశాలలో కల్లూరు, రాయలసీమ విశ్వవిద్యాలయంలో సి.బెళగల్‌, గూడూరు, కోడుమూరు, కర్నూలు, ఓర్వకల్లు, కృష్ణగిరి, వెల్దుర్తి, పాణ్యం, గడివేముల, కర్నూలు సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కళాశాలలో జూపాడుబంగ్లా, మిడుతూరు, జీడీసీలో నందికొట్కూరు, పాములపాడు, పగిడ్యాల, పడకండ్ల కేజీపీ ఇంగ్లిషు మీడియం స్కూలులో ఆళ్లగడ్డ, రుద్రవరం, దొర్నిపాడు, చాగలమర్రి, నంద్యాలలోని జీడీసీలో నంద్యాల, గోస్పాడు, బండిఆత్మకూరు, శిరువెళ్ల, మహానందికి సంబంధించి ఓట్ల లెక్కింపులు జరుగుతాయి. కాగా ఎక్కడైతే స్ట్రాంగ్‌ రూంలు భద్రపరిచారో అక్కడే లెక్కింపులు జరగనున్నాయి.

46 మండలాల పరిధిలో ఎన్నికలు

జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలకుగాను 16 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 37 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 807 ఎంపీటీసీ స్థానాల్లో 312 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 495 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అధికార పార్టీ సభ్యులు ఏడు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను పూర్తిగా ఏకగ్రీవం చేసుకోగా మరో తొమ్మిది మండలాల్లో కేవలం ఎంపీటీసీ స్థానాల వరకు ఏకగ్రీవం చేసుకున్నారు. దీంతో జిల్లాలో 46 మండలాల పరిధిలో 1,785 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని