యాసంగి సాగు పై 
eenadu telugu news
Updated : 28/10/2021 04:18 IST

యాసంగి సాగు పై 

అపరాలు గిట్టుబాటుకావనే యోచనలో అన్నదాతలు

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

యాసంగిలో వరి సాగు కట్టడికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వద్దని వినకుండా విత్తనాలిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని డీలర్లను ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుము, నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, మినుములు, సెనగలు, ఉలవల సాగు దిశగా రైతన్నలను సమాయత్తం చేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉభయ జిల్లాల కలెక్టర్లు సమీక్షలు జరిపారు. విత్తన సరఫరాదారులు, డీలర్లు, మిల్లర్లు, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కానీ.. అన్నదాతల యోచన క్షేత్రస్థాయిలో మరోలా ఉంది. వరికి తప్ప అనుకూలం కాని భూముల్లో అపరాల సాగు చేపట్టేదెట్టా? ఒకవేళ కష్టపడి పండించినా కష్టం దళారుల పాలేనా? అన్నది వారి సందేహం. యాసంగి సాగుకు ఎవరెవరి సన్నద్ధత ఎలా ఉందంటే..

వెనకడుగుకు కారణాలివే..

ఖమ్మం 2,26,220, భద్రాద్రి జిల్లాలో 79,456 ఎకరాల్లో వరి సాగవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతలు డోలాయమానంలో పడ్డారు. వారి వాదనలు ఇలా ఉన్నాయి..

* జవక, బాడవ, చౌడు, తేలికపాటి సమస్యలున్న నేలలు 60 శాతానికి పైగా ఉన్నాయి. ఇవి వరికి తప్ప మెట్ట పైర్ల సాగుకు పెద్దగా అనుకూలం కావు. నేల సారాన్ని మెట్ట సాగుకు మార్చుకోవడం రెండు, మూడేళ్లకు పైగా కాలానికి సంబంధించినది.

* ఒకవేళ నేల సారాన్ని మెట్ట పంటలకు అనుకూలంగా మార్చుకున్నా పెసలు మినహా మిగతా వాణిజ్య పంట ఉత్పత్తులను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. విక్రయాలకు ‘స్వేచ్ఛా విపణి’లోనూ తగిన వ్యవస్థల్లేవు. ఇదే జరి¸గితే నష్టాలు తప్పవన్న భయం ఉంది.

* సాగుకు సిద్ధపడినా సరిపడా నాణ్యమైన విత్తనాల్లేవు. పెసలు, బొబ్బర్లు, సజ్జలు, మినుములు, పొద్దుతిరుగుడు వంటి వాటికి కొరత ఉంది.

* తెగుళ్లు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని.. ఆశించిన దిగుబడులు వచ్చే హైబ్రిడ్‌ రకాలు లేవు. నకిలీ విత్తన విక్రయాలపై చర్యలు తీసుకోవడం పాటు బాధితులకు తగిన పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.

* పండిన పంట ఉత్పత్తులను అతి తక్కువ ధరకే దళారులు కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. పైగా పెట్టుబడి విషయంలో ఎరువులు, పురుగు మందుల అధిక ధరలతో నడ్డి విరుస్తున్నారు.

* గతంలో మొక్కజొన్న సాగు చేయవద్దని, విత్తనాలు అమ్మవద్దని డీలర్లను వ్యవసాయ శాఖ అధికారులు నియంత్రించినా.. రైతులు పొరుగు రాష్ట్రం ఆంధ్రాలోని వత్సవాయి, గంపలగూడెం, విస్సన్నపేట, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుని భారీగా సేద్యం చేశారు. వరి సాగుకు మాత్రమే అనుకూల భూములున్న వారు ఈ సారి కూడా ఇదే బాట పట్టే అవకాశం లేకపోలేదు.

* ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టుల్లో తగినంత నీరు అందుబాటులో ఉండటంతో యాసంగికి దాదాపు పాత సాగు పద్ధతే మేలనే భావనలో చాలా మంది ఉన్నారు.

డీలర్లలో అయోమయం

వరి విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు చేస్తామన్నది సర్కారు హెచ్చరిక. అపరాలు తెచ్చి విక్రయించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. కానీ రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసే ఇతర విత్తనాలు తగినన్ని అందుబాటులో లేవు. పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినా నాణ్యత సరిగా లేకుంటే తిరిగి తమపైనే ఒత్తిడి పడుతుందన్నది డీలర్ల ఆందోళన. ఒకవేళ తాము చేతులు కట్టేసుకున్నా దొడ్డిదారినో, పొరుగు రాష్ట్ర ప్రాంతాల్లోంచో కావాల్సిన వరి విత్తనాన్ని తెచ్చుకునేందుకు రైతులు వెనకాడరు. గతంలో మొక్కజొన్న విషయంలో ఇదే జరిగింది. తాజా పరిణామాలతో ఉభయ జిల్లాల్లోని డీలర్లు ఇరకాటంలో పడ్డారు.

టీఎస్‌ సీడ్స్‌ వద్దనున్న నిల్వలివే..

పంటల వారీగా క్వింటాళ్లలో.. పెసర (ఎంజీజీ.295): 650, మినుములు (పీయూ31): 1800, కందులు (ఐసీపీఎల్‌ 87119):   33.40, వేరుసెనగ (కె-6): 111, సెనగ (జేజీ 11): 100, నువ్వులు (శ్వేత): 10, జీలుగలు: 12.30, జనుములు: 18.40, పిల్లిపెసర: 400.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని