ముక్కోటి ఉత్సవాలపై సమీక్ష ఇంకెన్నడో?
eenadu telugu news
Published : 28/10/2021 01:28 IST

ముక్కోటి ఉత్సవాలపై సమీక్ష ఇంకెన్నడో?

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో శ్రీరామ నవమి తర్వాత ముక్కోటి ఏకాదశికి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. సంక్రాంతి సంబరాల తరుణంలో జరిగే ఈ క్రతువుకు.. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో దాదాపు 3 నెలల ముందు నుంచే ఉత్సవాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముక్కోటికి హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతి వచ్చాక రూ.50 లక్షలకు తగ్గకుండా భద్రాచలం, పర్ణశాలలో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడెక్కడ ఎలాంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేయాలి. జిల్లాలోని ప్రధాన శాఖలతో సమీక్ష చేసి సన్నద్ధత ప్రకటించాల్సి ఉంది. కానీ ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో ఉత్సవాలు చేస్తారా? లేదా? అనే సందిగ్ధత భక్తుల్లో నెలకొంది. దీన్ని నివృత్తి చేయాలి.

సెక్టార్‌ టిక్కెట్‌ల విక్రయం ఉండేనా?:  ముక్కోటి వేడుకలో వేదిక అలంకరణ, తెప్పోత్సవ హంసాలంకారం ఎంతో ప్రత్యేకమైనవి. కావాల్సిన విడిభాగాలను సకాలంలో నది వద్దకు చేర్చి హంస ఆకృతిని తీర్చిదిద్దాలి. మూడేళ్ల క్రితం తుపాను కారణంగా హంస విహారం లేకుండానే వేడుక ముగించారు. ఆ తర్వాత కొవిడ్‌ ఆంక్షలతో ఆలయ ప్రాంగణంలోనే నిరాడంబరంగా తెప్పోత్సవం చేశారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వేడుకకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా భక్తులకు సెక్టార్ల ఏర్పాటు చేయాలి. ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయాలపై దృష్టిపెట్టాలి. దాదాపు 4 వేల మందికి వీక్షణ అవకాశం ఉండగా.. ఈ సంఖ్య విస్తరించేలా ప్రయత్నించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. వేడుకలోగా సాధారణ పరిస్థితులుంటే ఈ సారైనా ముక్కోటి పర్వదినం కనువిందు చేసేలా ఉన్నతాధికారులు సమీక్షలు జరపాలని భక్తజనం కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని