వృత్తి విద్య పై నిర్లక్ష్యం
eenadu telugu news
Published : 28/09/2021 04:06 IST

వృత్తి విద్య పై నిర్లక్ష్యం

కల్పించని త్రీఫేజ్‌ విద్యుత్తు సదుపాయం

తుప్పు పడుతున్న రూ.లక్షల విలువైన సామగ్రి

తుప్పు పడుతున్న వెల్డింగ్‌ యంత్రాలు

ఉన్నత చదువులు చదివే స్తోమత లేనివారు వృత్తి విద్యా కోర్సులను ఎంచుకుంటారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలోనే నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగం, ఉపాధి పొందే అవకాశం ఉండటంతో గ్రామీణ/మన్యం ప్రాంత యువత ఈ కోర్సులపై మక్కువ చూపుతుంటారు. అయితే అధికారులు నిర్లక్ష్యం వల్ల వారికి సరైన విద్య అందడం లేదు. రూ.లక్షల విలువైన పరికరాలు సమకూర్చినా త్రీఫేజ్‌ విద్యుత్తు సదుపాయం లేక అవి దిష్టిబొమ్మల్లా మారాయి. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ లేకపోవడంతో నైపుణ్యాలపై ప్రభావం పడుతోంది. చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేక బోధన మిథ్యగా మారింది. జిల్లాలోని వృత్తివిద్యా కళాశాలల్లో నెలకొన్న సమస్యలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

చర్ల, న్యూస్‌టుడే

జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మన్యం ప్రాంతాలైన చర్ల, ఇల్లెందు, ములకలపల్లి, అశ్వారావుపేటతోపాటు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం కళాశాలల్లో వృత్తి విద్య కోర్సులున్నాయి. చాలాచోట్ల జూనియర్‌ కళాశాలల్లో త్రీఫేజ్‌ విద్యుత్తు సౌకర్యం లేక విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందని ద్రాక్షగా మారింది. రూ.లక్షల విలువైన సామగ్రి నిరుపయోగంగా మారింది. ల్యాబ్‌ మెటీరియల్‌ ఉపయోగకరంగా లేక వృత్తి విద్య లక్ష్యం నీరుగారిపోతోంది. చర్ల కళాశాలకు త్రీఫేజ్‌ విద్యుత్తు సౌకర్యం లేక 2012లో తెచ్చిన రూ.లక్షల విలువైన లేత్‌ మిషన్‌, మోటార్లు, డ్రిల్లింగ్‌ మిషన్లు, వెల్డింగ్‌ యంత్రాలు, గ్రీజర్లు మూలనపడి తుప్పు పడుతున్నాయి. కళాశాలలకు నిర్వహణ గ్రాంట్‌ మంజూరు కాకపోవడం సమస్యగా మారుతోంది.చర్ల, ఇల్లెందు, పాల్వంచ, ములకలపల్లి కళాశాలల్లో త్రీఫేజ్‌ సౌకర్యం లేదు. జిల్లాలోని ఆయా కళాశాలల్లో సాంకేతికపరమైన కోర్సులకు అవసరమైన సామగ్రి చాలినంతగా లేకపోవడం, అసౌకర్యాలు చదువుపై ప్రభావం చూపుతున్నాయి.

గురువులేరీ..

ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) కోర్సులు గతేడాది కొన్ని కళాశాలలకు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు ఫ్యాకల్టీ లు లేరు. గురువులు లేకుండా చదువు ఎలా సాగుతుందో అధికారులకే తెలియాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లోని అంశాల్లో విద్యార్థులు ఏమాత్రం నైపుణ్యం పొందలేక వృత్తి విద్య మిథ్యగా మారుతోంది. మొదటి ఏడాది తరగతులు చెప్పే దిక్కులేక ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు ఆయా అంశాల్లోపట్టు లేకుండా పోయింది. ఎంఎల్‌టీ విద్యార్థులకు ఈనాటికి రక్త పరీక్షలు, ఎక్స్‌రే ఇతరత్రా పరీక్షలు ఎలా చేయాలో తెలియని పరిస్థితి. ఆయా కోర్సులకు సంబంధించి ఇంతవరకు ల్యాబ్‌ మెటీరియల్‌ అందుబాటులో లేదు. త్రీఫేజ్‌ సౌకర్యం లేక యంత్రాలు పనిచేయక వృత్తివిద్యా కోర్సులు చదివే విద్యార్థులకు శిక్షణ  నైపుణ్యం కరవైంది. ఈ కోర్సుల్లో ఇప్పటికే ప్రవేశాలు జరిగాయి. గత ఏడాది ఆయా కోర్సులను ఫ్యాకల్టీ నియామకం చేయకుండానే నెట్టుకొచ్చారు. ఓఏకు సంబంధించి కంప్యూటర్లు చాలా వరకు మూలనపడ్డాయి. చాలా కళాశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది. కరోనాతో ఈ పరిస్థితులు దాపురించినా ఈ సమస్యకు పరిష్కారం చూపకుండానే బోధన ప్రారంభించారు. జిల్లాలో అనేక కళాశాలలకు త్రీఫేజ్‌ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. తద్వారా కళాశాలలకు వచ్చిన రూ.లక్షల విలువైన సామగ్రి పాడైపోతోంది.
త్రీఫేజ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం
సులోచనారాణి, డీఐఈవో

కళాశాలల్లో చాలాచోట్ల త్రీఫేజ్‌ విద్యుత్తు సమస్య ఉంది. ప్రధానాచార్యులతో ఈ సమస్యపై సమీక్ష నిర్వహించి ల్యాబ్‌ మెటీరియల్‌ను ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు చేపడతాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని