వరుణుడి జోరు
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

వరుణుడి జోరు

జిల్లాను బెంబేలెత్తించిన ‘గులాబ్‌’

ఖమ్మం వ్యవసాయం, కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

చింతకాని: నాగులవంచలో నాలుగు అడుగుల మేర నీరు చేరి నీట మునిగిన దుకాణాలు

‘గులాబ్‌’ ధాటికి ఉభయ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన భారీ వర్షం సోమవారం కూడా కొనసాగింది. వరుణుడి జోరుకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వాగులూ, వంకలు పొంగి పొర్లాయి. ప్రధాన రహదారులపై నుంచి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోజంతా వర్షం కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

వైరా సమీపంలో నీటమునిగిన పంట పొలాలు

జిల్లాలోని వైరా, కామేపల్లి, కొణిజర్ల, సింగరేణి, బోనకల్లు, మధిర మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మొత్తం 16 మండలాల్లో భారీ, ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో వరి, పత్తి, మిరప, కూరగాయల పంటలు నీట మునిగాయి.  వైరా, ఎర్రుపాలెం, ఏన్కూరు, కొణిజర్ల, సత్తుపల్లి, కామేపల్లి, మధిర, సింగరేణి  మండలాల్లో వరి నీట మునిగింది.

రాకపోకలకు అంతరాయం.. తుపాను ప్రభావంతో వేంసూరు మండలం కల్లూరుగూడెంలో రోడ్డుపై చెట్టుపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలం నాగులవంచ-పాతర్లపాడు మధ్య బండిరేవు వాగు రహదారిపై అయిదు అడుగుల మేర వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించటంతో రాకపోకలను నిలిపేశారు. మధిర మండలం వంగవీడు వద్ద పాలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తల్లాడ బస్టాండ్‌ సమీపంలోని ఆర్‌సీఎం చర్చి వద్ద భారీగా చేరిన వరదనీటితో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.

* జిల్లా వ్యాప్తంగా చెరువులు పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నాయి. జిల్లాలో 1,409 చెరువులు ఉండగా వాటిలో 851 చెరువులు పూర్తి స్థాయిలో నీటితో నిండి అలుగులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. మరో 558 చెరువులు 75 నుంచి 100 శాతం మధ్య నీటితో నిండాయి. వైరా రిజర్వాయర్‌, లంకాసాగర్‌, పాలేరు జలాశయాలు పూర్తి స్థాయిలో నీటితో నిండి తొణికిసలాడుతున్నాయి.

* జిల్లాలో ఖమ్మం 10మంది, పెనుబల్లి, వైరా ప్రాంతాల్లో 79 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.


గోదావరికి వరద

భద్రాచలం వద్ద గోదావరికి క్రమంగా వరద వచ్చి చేరుతోంది.  ఆదివారం 28 అడుగుల నీటిమట్టం ఉండగా సోమవారం రాత్రి 8కి 32.4 అడుగులకు పెరిగింది. చిరు వ్యాపారాలు సాగించే తాత్కాలిక దుకాణాలు మూత పడ్డాయి. ఒక వైపు బురద మరో వైపు వర్షం పడుతుండడంతో పుణ్య స్నానాలకు వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎగువన ప్రాజెక్టులు నిండితే ఆ నీటిని విడుదల చేసే వీలుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నీటిమట్టం పెరుగుదల ఇంకొంచెం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావాన్ని గుర్తించిన అధికారులు క్షేత్రస్థాయిలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు.

భద్రాచలం, న్యూస్‌టుడే


నిలిచిన బొగ్గు ఉత్పత్తి

స్నానఘాట్‌ వద్ద ఇలా కనిపిస్తున్న గోదారి

కొత్తగూడెం ప్రాంతంలో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో జీకే ఉపరితలగనిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి షిప్టు మొదలుకొని సోమవారం రాత్రి వరకు వర్షం ఎడతెరిపివ్వకుండా కురిసింది. దీంతో మూడు షిప్టుల్లో సుమారు 9 వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగేవీలుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు వెలికితీసిన బొగ్గును రవాణా చేస్తున్నట్లు వారు తెలిపారు.

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే


వైరా.. విలవిల

నగరంలోని చెరువు బజార్‌లో జలమయమైన ఓ వీధి

వైరా, న్యూస్‌టుడే: భారీ వర్షాలతో వైరా విలవిలలాడింది. పరిస్థితి ఎక్కడ చూసినా జల వలయంలా మారింది. ఎన్నడూ చూడనంత వరద రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సత్రం బజార్‌, పన్నెండు, పదమూడో వార్డుల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. మధిర రోడ్డులో ప్రధాన రహదారి వెంట డ్రైనేజీ పూడిపోయి వరద, డ్రైనేజీ నీరు దుకాణాల్లోకి చేరింది. మరోవైపు సోమవరం నల్లచెరువు పొంగి పొర్లడంతో వాగు ఉద్ధృతంగా ప్రవహించి ఇందిరమ్మ కాలనీలో సగం ఇళ్లల్లోకి నీరు చేరింది. వీరిని మార్కెట్‌యార్డుకు తరలించారు. ఇందిరమ్మ కాలనీ వాగు పొంగడంతో వైరా నుంచి మధిర, జగ్గయ్యపేట వెళ్లే రోడ్డుపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజీవ్‌నగర్‌ వాసులను పక్కనే ఉన్న పాఠశాలకు తరలించారు. స్నానాలలక్ష్మీపురం వద్ద వైరానది ప్రవాహం అమాంతం పెరగడంతో వంతెన మునిగి రాకపోకలు నిలిచాయి. గన్నవరం, అష్ణగుర్తి, వల్లాపురం వద్ద వాగులు పొంగి ఇదే పరిస్థితి తలెత్తింది. ఏసీపీ స్నేహమెహ్రా, సీఐ వసంత్‌ పరిస్థితిని సమీక్షించారు. అప్రమత్తంగా ఉంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాములునాయక్‌ సూచించారు.

ప్రమాదకర స్థాయిలో జలాశయం..

వైరా జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇన్‌ఫ్లో చాలా ఎక్కువగా ఉండటంతో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం సామర్థ్యం 18.4 అడుగులు కాగా ఒక్కసారిగా 21.3 అడుగులు దాటింది. ఒక్కరోజులోనే సుమారు రెండున్నర అడుగుల మేర నీరు చేరడంతో అలుగులు ఉద్ధృతంగా పారుతున్నాయి. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సుమారు పదిహేను వేల క్యూసెక్కుల వరకు ఉంటుందని నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్‌ తెలిపారు.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని