‘దళితబంధు’ అమలులో బ్యాంకర్లే కీలకం: కలెక్టర్‌
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

‘దళితబంధు’ అమలులో బ్యాంకర్లే కీలకం: కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దళితబంధు పథకాన్ని అమలు చేయడంలో బ్యాంకర్లే కీలక పాత్ర వహిస్తారని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో దళితబంధు విధివిధానాలను వివరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతకాని మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం నేరుగా ప్రభుత్వం అందిస్తుందని, ఇందుకు బ్యాంకుల్లో లబ్ధిదారులు ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ద్వారా థర్డ్‌పార్టీ ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సి ఉంటుందని, రూ.10 లక్షల పూర్తి సమాచారం కలెక్టర్‌ డాష్‌ బోర్డ్‌పై ఉంటుందన్నారు. త్వరలో సర్వే ప్రారంభం అవుతుందని, సర్వే బృందంతోపాటు బ్యాంక్‌ సిబ్బంది లబ్దిదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించవచ్చని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌, ఎల్డీఎం చంద్రశేఖర్‌రావు, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్‌బీఐ ఆర్‌ఎం వి.బి.నారాయణ, యూబీఐ డీజీఎం పార్థసారథి, ఏపీజీవీబీ ఆర్‌ఎం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

48 గంటలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రానున్న 48 గంటలు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి నీటిపారుదల, విద్యుత్తు, పంచాయతీరాజ్‌, పోలీస్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాగులు, వంతెనలు, లో లెవల్‌ కాజ్‌వేలు, చప్టాలు, రోడ్లపైకి నీరు ప్రవహించే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించి దారి మళ్లించాలని సూచించారు. గండి పడే ప్రమాదం ఉన్న చెరువులు, నీటి వనరులు, కుంటలు, కాలువల వద్ద ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు  నిరంతరాయంగా విధుల్లో ఉండాలని, రాత్రుళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077, 9063211298కు ఫోన్‌ చేయటంతోపాటు, వాట్సాప్‌ చేయవచ్చని తెలిపారు. సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌, అదనపు కలెక్టర్లు మధుసూదన్‌, స్నేహలత, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని