నిరసనల హోరు
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

నిరసనల హోరు

ఖమ్మంలో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులు

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో సోమవారం పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్‌ ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. దేశంలోని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) బంద్‌కు పిలుపునివ్వగా కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ సహా విపక్షాల మద్దతిచ్చాయి. జిల్లా అంతటా జోరున వర్షం కురుస్తున్నా విపక్ష నేతలు లెక్కచేయక సోమవారం ఉదయం 5 గంటలకే రోడ్లపైకి వచ్చారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిరలో ఆర్టీసీ బస్‌ డిపోలు, బస్టాండ్‌లలో బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కళాశాలలు, వ్యవసాయ మార్కెట్లు, బ్యాంకులు, పెట్రోల్‌ బంక్‌లు, హోటళ్లు, వర్తక, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఖమ్మంలోని పలు షాపింగ్‌ మాల్స్‌ మూసేశారు. జిల్లాలోని సినిమా థియేటర్లలో ఉదయం, మధ్యాహ్నం ఆటలు రద్దు చేశారు. ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్లు ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. సూర్యాపేట- ఖమ్మం- అశ్వారావుపేట జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు జోరు వాన, మరో వైపు బంద్‌ ప్రభావంతో జిల్లాలో జన జీవనం స్తంభించింది. పోలీసులు విపక్ష నేతలను ఉదయం 10 గంటల తర్వాత అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడక్కడ దుకాణాలు తెరిచారు. ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని కొత్త బస్టాండ్‌ ప్రధాన గేటువద్ద కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెదేపా, తెలంగాణ ఇంటి పార్టీ నేతలు బైఠాయించారు. బస్టాండ్‌లోకి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. మరోవైపు బైపాస్‌ రోడ్‌పై లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ఖమ్మంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్‌, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, తెదేపా నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, తెలంగాణ ఇంటిపార్టీ నాయకుడు బత్తుల సోమయ్య తదితరులు, రైతు సంఘాలు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.


నిర్మానుష్యంగా ఖమ్మం బస్టాండ్‌

నల్ల చట్టాలు రద్దు చేయాల్సిందే: విపక్ష నేతలు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నీరుగార్చే నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు సుమారు పది నెలలుగా ఆందోళన చేస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలోని కర్మాగారాలు, జాతీయ రహదారులు, పైప్‌లైన్లు వంటి ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేస్తూ అన్ని వర్గాల ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. దిల్లీలో రైతులు సాగిస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని