పల్లె దవాఖానాల ఏర్పాటుకు చర్యలు
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

పల్లె దవాఖానాల ఏర్పాటుకు చర్యలు

పల్లె దవాఖానాగా మారనున్న కారేపల్లి మండలం సీతారామపురం సబ్‌సెంటర్‌

గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు గ్రామాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటుచేయనుంది. గతంలో ఆరోగ్య ఉప కేంద్రాలను హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా ప్రకటించిన విషయం విధితమే. తాజాగా వాటిని పల్లె దవాఖానాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల వీటికి సంబంధించిన విధి విధానాలను విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 102 వెల్‌నెస్‌ సెంటర్లు పల్లె దవాఖానాలుగా ప్రజలకు సేవలందించనున్నాయి. వీటిలో సదుపాయాల కల్పన, మానవ వనరులపై అధికారులు దృష్టి సారించారు.

పల్లె దవాఖానాల్లో మిడ్‌లెవల్‌ మెడికల్‌ ఆఫీసర్‌(వైద్యాధికారి), ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తారు. రోగులకు ఇప్పటివరకు పీహెచ్‌సీల్లో లభ్యమవుతున్న సేవలను ఇక్కడ పొందుతారు. ఈ దవాఖానాలను ప్రభుత్వ ఉన్నతస్థాయి డయాగ్నస్టిక్‌ కేంద్రం(టీహబ్‌)కు అనుసంధానం చేస్తూ ఖరీదైన రక్తపరీక్షలు చేస్తారు. అవసరమైతే టెలీ కన్సల్టెన్సీలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండగా వైద్యాధికారుల నియామకంపై ఆరోగ్య శాఖ దృష్టిసారించింది.
జిల్లాలో ఇక్కడే..
జిల్లాలో 102 వెల్‌నెస్‌ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో బోదులబండ-05, బోనకల్లు-08, చెన్నూరు-05, చింతకాని-09, ఏన్కూర్‌-10, కల్లూరు-05, కామేపల్లి-09, మంచుకొండ-11, సింగరేణి-13, తల్లాడ-09, వేంసూరు-08, నేలకొండపల్లి-01, వైరా-09 కేంద్రాలను పల్లె దవాఖానాలుగా ఏర్పాటు చేశారు. గతంలో సింగరేణి, కామేపల్లి పీహెచ్‌సీల పరిధిలో 16 మంది వైద్యాధికారులు ఉన్నారు. మిగిలిన 86 మందిని నియమించేందుకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని