అవినీతి అంతస్తులు
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

అవినీతి అంతస్తులు

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే

కాసులుంటే చాలు.. అప్పటికే నిర్మించిన అక్రమ కట్టడాలకు సైతం యథేచ్ఛగా అనుమతులు పొందొచ్చు. కొత్త పురపాలక చట్టం ప్రకారం భారీ జరిమానా ఎదుర్కోవాల్సిన భయం అంతకన్నా లేదు. ఇదీ.. కొత్తగూడెం ప్రథమశ్రేణి పురపాలకంలో అవినీతి ‘అంతస్తుల’ తీరు! పట్టణ ప్రణాళిక విభాగం అక్రమాలకు వేదికగా మారిందన్న విమర్శలున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడొకరు, మరో ప్రజాప్రతినిధి, కీలక అధికారి, పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన కొందరు అధికార సిబ్బంది కుమ్మక్కై చట్టాలకు తూట్లు పొడుస్తూ యజమానులకు వంతపాడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి టీఎస్‌ బీ-పాస్‌ను ఇటీవల పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అవినీతికి తావు లేకుండా, నిబంధనల అమలు పారదర్శకంగా జరిగేలా ఎన్‌ఫోర్సుమెంట్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది. దీని ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, కో ఛైర్మన్‌గా ఎస్పీ వ్యవహరిస్తారు. కమిషనర్‌, టీపీఓ, టీపీఎస్‌, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ విభాగాల  ఏఈ స్థాయి అధికారులు, స్థానిక సీఐ సభ్యులుగా ఉంటారు. అనుమతులు, నిర్మాణాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? అని 15 రోజులకోసారి సమీక్షించాలి.
ఫిర్యాదులను పరిష్కరించాలి. విరుద్ధ కట్టడాలను కూల్చివేసే అధికారమూ కమిటీకి ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారం 100 శాతం వరకు జరిమానా విధించే అవకాశముంది. కానీ కమిటీ కళ్లుగప్పి అవినీతి దందా కొనసాగిస్తుండటం గమనార్హం. ఇది వరకే భవనం నిర్మించి ఉంటుంది. కానీ పక్కనున్న ఖాళీ స్థలం చూపి టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేస్తారు. ఆ వెంటనే అనుమతులొస్తాయి. ప్రక్రియ అంతా అడ్డదారుల్లో నడుస్తుంది. చట్టం ప్రకారం అంతా సవ్యంగా ఉంటుంది. తనిఖీలు బెడద లేదు. ఉల్లంఘనలు బయటకు పొక్కేందుకు వీలుండదు.  

* మేదరబస్తీలో ఓ ఇంటిని అనుమతుల్లేకుండా నిర్మించారు. రెండో అంతస్తు నిర్మించాలని ఇటీవల యజమాని పట్టణ ప్రణాళిక విభాగంలో తెలిసిన వారిని సంప్రదించాడు. వారి సూచనతో  వెనుకనున్న ఖాళీ స్థలం చూపి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేశాడు. ఆపై ఓ ప్రజాప్రతినిధిని సంప్రదించగా రూ.70 వేలు తీసుకుని అనుగ్రహించాడు. కొందరు సిబ్బందికి రూ.లక్ష ముట్టజెప్పడంతో అనుమతి మంజూరైంది. ఇటు రెండో అంతస్తూ పూర్తికావచ్చింది.
* పాతబస్‌ డిపో సమీపంలో ఓ భవన నిర్మాణానికి సెప్టెంబరు 4, 2021న దరఖాస్తు చేయగా.. 16న అనుమతులు మంజూరయ్యాయి. 26వ తేదీ కల్లా ఆ స్థలంలో 3 అంతస్తుల భవన నిర్మాణం జరిగింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. భవన నిర్మాణం జరిగి పదేళ్లు కాగా.. పక్కన ఖాళీ స్థలం చూపి అనుమతులు పొందారు. ఈ ఏడాది జనవరిలో క్రమబద్ధీకరణ పట్టాలొచ్చాయి.
* ఫ్యూన్‌బస్తీ సింగరేణి నర్సు క్వార్టర్స్‌ సమీపంలో చేపట్టిన నిర్మాణానికి అనుమతుల్లేవని అధికారులు అడ్డుకున్నారు.   యజమానులు ప్రధాన పార్టీ నాయకుణ్ని ఆశ్రయించి రూ.7 లక్షలు ముట్టజెెప్పారు. తర్వాత నిర్మాణం పూర్తయింది. జనవరిలో క్రమబద్ధీకరణ పట్టా కూడా వచ్చింది. వాస్తవానికి ఆ స్థలం రిజిస్ట్రేషన్‌లో అప్పటికే భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ 2021, మార్చి 23న అది ఖాళీ స్థలమంటూ దరఖాస్తు చేయగా అదే రోజు అనుమతులు మంజూరయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని