కొబ్బరి మొక్కల చాటున 6.25 క్వింటాళ్ల గంజాయి
eenadu telugu news
Published : 28/09/2021 03:43 IST

కొబ్బరి మొక్కల చాటున 6.25 క్వింటాళ్ల గంజాయి

ముగ్గురి అరెస్టు.. ప్రధాన నిందితుడు పరారీ

వివరాలను వెల్లడిస్తున్న చుంచుపల్లి సీఐ గురుస్వామి

చుంచుపల్లి, న్యూస్‌టుడే: మొక్కల చాటున లారీలో తరలిస్తున్న గంజాయి బస్తాలను చుంచుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ గురుస్వామి, ఎస్సై మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని విద్యానగర్‌ వద్ద సోమవారం వాహన తనిఖీల్లో భాగంగా కొబ్బరి మొక్కలు తరలించే లారీని పోలీసులు తనిఖీ చేశారు. మొక్కల కింద 26 బస్తాల్లో 625 కిలోల గంజాయి లభ్యమైంది. దీని బహిరంగ మార్కెట్‌ విలువ రూ.1.25 కోట్లు.
మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లా భూమ్‌ గ్రామానికి చెందిన శ్యామ్‌ శివాజీ కలే(30) కూలీ పనులు చేస్తుంటాడు. పుణెకు చెందిన సోదరి ఇంటికి వెళ్లిన సమయంలో కున్లే(29)తో పరిచయమైంది. గంజాయిని ఒడిశా నుంచి పుణేకు చేర్చితే నగదు ఇప్పిస్తానని అతడు ఆశ చూపాడు. అందుకు కలే అంగీకరించాడు. కున్లే అనుచరులైన ప్రభాకర్‌ లక్ష్మణ్‌ తంటే, అరవింద్‌ దిలీప్‌ గులేతో కలిసి లారీలో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి అటవీ ప్రాంతానికి వచ్చాడు. ముందే ఆ ప్రాంతానికి చేరుకున్న కున్లే రహస్యంగా కొనుగోలు చేసిన 6.25 క్వింటాళ్ల గంజాయిని సోమవారం లోడింగ్‌ చేయించాడు. అనంతరం అక్కడ్నుంచి తిరిగి విడిగా సొంత రాష్ట్రానికి వెళ్లాడు. విద్యానగర్‌ వద్ద మిగిలిన ముగ్గురూ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, ప్రధాన నిందితుడైన కున్లే పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని