కుటుంబ సభ్యుల పేరిట మొక్కలు నాటండి: మంత్రి
eenadu telugu news
Published : 24/07/2021 03:56 IST

కుటుంబ సభ్యుల పేరిట మొక్కలు నాటండి: మంత్రి


పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అజయ్‌కుమార్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనలో నాటే మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాటిని సంరక్షించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ముక్కోటి వృక్షార్చనపై శుక్రవారం ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలోని అన్ని డివిజన్లకు మొక్కలు, ట్రీగార్డులు కేటాయించామని, వెంటనే గుంతలు తీసుకొని మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలన్నారు. డివిజన్ల పార్టీ ఇన్‌ఛార్జీలు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి కేటీఆర్‌కు ఖమ్మం నగరం నుంచి భారీ కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, ఉపమేయర్‌ ఫాతిమాజోహ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అజీజ్‌ఉల్‌హక్‌, తెరాస జిల్లా కార్యాలయ ఇన్‌ఛార్జి గుండాల కృష్ణ, నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, కార్పొరేటర్‌లు, నాయకులు పాల్గొన్నారు.

ముంపు బాధితుల పునరావాసానికి చర్యలు

నగరపాలకంలోని మున్నేటి ముంపు బాధితుల పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి అజయ్‌ తెలిపారు. కలెక్టర్‌ గౌతమ్‌, ఎమ్మెల్సీ బాలసాని, మేయర్‌ నీరజ, కమిషనర్‌ అనురాగ్‌తో కలసి నగరంలోని మున్నేటి ఉద్దృతిని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 18అడుగులు చేరుకుందని, 20అడుగు వరకు వస్తే ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని తరలించేందుకు నయాబజార్‌ పాఠశాలలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 20కుటుంబాల వారిని తరలించామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నీటి పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో ప్రజల పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని