క్రమబద్ధీకరణలో కదలిక
eenadu telugu news
Published : 24/07/2021 03:51 IST

క్రమబద్ధీకరణలో కదలిక

ఉభయ జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన

15 రోజుల్లో సిద్ధం కానున్న అర్హుల జాబితా

కొత్తగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే

ఎప్పుడో స్థలం కొని ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని పురపాలక కార్యాలయానికి వెళ్తే.. లేఔట్‌ అనుమతి లేదంటూ పురపాలక అధికారులు అనుమతులు తిరస్కరించేవారు. బ్యాంకు రుణం పొందాలన్నా, ఇల్లు కట్టాలన్నా అనుమతి తప్పనిసరి. ఈ ఇబ్బందులను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు అవకాశం కల్పించింది. ఈ పథకంపై 31.08.2020న జీవో నంబరు 131 జారీ చేసింది. దీని ప్రకారం 2020, ఆగస్టు 26కి ముందు రిజిస్ట్రేషన్‌ అయిన వాటిని క్రమబద్ధీకరించుకోవచ్ఛు జీవో జారీ చేసిన 45 రోజుల్లోగా దరఖాస్తులను కోరింది. ఆ తర్వాత పలు కారణాలతో ప్రక్రియ వాయిదా పడింది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించేందుకు మూడు రోజుల కిందట ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. లేఔట్లు, ప్లాట్లను పరిశీలిచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో వార్డులు, సర్వే నంబర్ల వారీగా క్లస్టర్లను రూపొందించనున్నారు. క్షేత్రస్థాయిలో బృందాలు పరిశీలించి అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమర్పిస్తాయి.

పరిశీలన రెండు దశల్లో

1. అనధికారిక ప్లాట్లు, లేఔట్ల యజమానుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పురపాలక/నగరపాలక/పంచాయతీల వారీగా.. వాటిల్లో వార్డులు, కాలనీలు, సర్వేనంబర్ల ప్రకారం క్లస్టర్లుగా విభజిస్తారు.

2. పురపాలక పట్టణ ప్రణాళిక, జలవనరులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌కు చెందిన జిల్లా స్థాయి అధికారులను బృందాలుగా నియమించి 15 రోజుల్లో పరిశీలన పూర్తిచేయిస్తారు. తొలుత పుర/నగరపాలక సంస్థల్లో ప్రక్రియ పూర్తిచేయనున్నారు.

ఆదేశాలు జారీ చేశాం: - దురిశెట్టి అనుదీప్‌, కలెక్టర్‌, భద్రాద్రి

నిబంధనలు పాటించకుండా కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. పురపాలక, పంచాయతీల పరిధిలో గతేడాది ప్లాటుకు రూ.వెయ్యి, లేఔటుకు రూ.10 వేలు రుసుం చెల్లించి దరఖాస్తు చేసిన వారి ప్లాట్లను ప్రత్యేక బృందం పరిశీలిస్తుంది. అర్హుల జాబితాను కమిషనర్ల ద్వారా 15 రోజుల్లో అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.

మొత్తం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు: 83,532

రుసుం వసూలు: రూ.8.35 కోట్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని