వరద గోదావరి
eenadu telugu news
Published : 24/07/2021 03:34 IST

వరద గోదావరి

బూర్గంపాడు సమీపంలోని గొమ్మూరు ర్యాంపు వద్ద నదీ ప్రవాహం

భద్రాచలం, బూర్గంపాడు, న్యూస్‌టుడే: భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. తీరప్రాంతంలో ఎడతెరిపినివ్వని వానతోపాటు ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు 20.1 అడుగులకు చేరగా అర్ధరాత్రి 12 గంటలకు 34.3 అడుగులకు పెరిగింది. ప్రతీ గంటకు నీటిమట్టం పెరుగుతోంది. శనివారం నాటికి వరద తీవ్రరూపం దాల్చితే మొదటి, రెండో హెచ్చరికలు జారీ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్‌టుడే: ముసురు నుంచి ఇంకా జిల్లా తేరుకోలేదు. శుక్రవారం అక్కడక్కడా కాస్త వాతావరణం తెరిపి ఇచ్చినా.. మరికొన్ని చోట్ల వర్షం కురిసింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 707.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు మండలంలో 74.8 మి.మీ. అత్యల్పంగా అశ్వారావుపేటలో 16.2 మి.మీ. వర్షం కురిసింది. మండలాల వారీగా చూస్తే పినపాక 64.4, చర్ల 30.6, దమ్ముగూడెం 58.6, అశ్వాపురం 46.4, మణుగూరు 56.6, గుండాల 36.4, టేకులపల్లి 36.2, జూలూరుపాడు 60.0, చండ్రుగొండ 47.8, కొత్తగూడెం 30.2, పాల్వంచ 39.2, బూర్గంపాడు 27.4, భద్రాచలం 25.4, ముల్కలపల్లి 20.2, దమ్మపేటలో 36.8 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.

చర్ల: లంకల్లోంచి బయటపడిన యువకులు వీరే

పెరుగుతున్న తాలిపేరు

చర్ల, న్యూస్‌టుడే: తాలిపేరు ప్రాజెక్టులో శుక్రవారం రాత్రి వరద ప్రవాహం పెరిగింది. ఓ పక్క గోదావరి వరద ఉద్ధృతంగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు తాలిపేరు పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.ప్రాజెక్టులో 15 గేట్లు ఎత్తి 18,176 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగపోటుతో తేగడ వద్ద తాలిపేరు లోలెవల్‌ చప్టా నీటమునిగింది.

సీతమ్మ సాగర్‌ కాఫర్‌ డ్యామ్‌ పైనుంచి ప్రవహిస్తున్న నీరు

లంకల్లో చిక్కుకున్న యువకులు..

గోదావరి లంకల్లో చిక్కుకున్న నలుగురు యువకులను గ్రామస్థుల సమాచారంతో అధికారులు శుక్రవారం రాత్రి రక్షించారు. సి.కత్తిగూడెం పరిధిలోని గోదావరి లంకల్లోకి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఇర్పా విజయ్‌కాంత్‌, ఇర్పా శ్రీకాంత్‌, గౌర్ల సాయికుమార్‌, బొగ్గుల సునీల్‌ వరదల్లో చిక్కారు. దారులన్నీ మూసుకుపోవడంతో కుటుంబసభ్యులు చరవాణి ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్‌, తహసీల్దార్‌ వీరభద్ర ప్రసాద్‌, ఎస్సై రాజువర్మ, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి అక్కడికి చేరుకొని తేగడలోని పడవల యజమానులను రప్పించారు. పడవల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని