గోదావరి ఉద్ధృతిపై మంత్రి పువ్వాడ ఉన్నత స్థాయి సమీక్ష
eenadu telugu news
Published : 24/07/2021 02:35 IST

గోదావరి ఉద్ధృతిపై మంత్రి పువ్వాడ ఉన్నత స్థాయి సమీక్ష

విపత్తును నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలి

కరకట్టపై పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ అనుదీప్‌

భద్రాచలం, న్యూస్‌టుడే: విపత్తును నివారించేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి పువ్వాడ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ రెండో ప్రమాద హెచ్చరికకు నీటిమట్టం చేరే వీలుందని.. ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. నిండు గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. తాగునీటిని శుద్ధిచేసి సరఫరా చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం విషయంలో అలసత్వం వహించొద్దన్నారు. గోదావరి తీరంలో జనం సంచరించకుండా పోలీసులు కట్టడి చేయాలని ఎస్పీ సునీల్‌దత్‌కు సూచించారు. భద్రాచలం కేంద్రంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్‌ అనుదీప్‌ను ఆదేశించారు. అంతకుముందు భద్రాచలంలో వంతెన వద్ద కొద్దిసేపు ఉండి ప్రవాహ పరిస్థితిని మంత్రి పరిశీలించారు. ముంపు ప్రాంతమైన కొత్తకాలనీ వాసులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరకట్ట మీద నడిచి స్లూయీస్‌ల మరమ్మతులపై ఆరా తీశారు. విస్తా కాంప్లెక్స్‌ వద్ద తిరుగు నీళ్ల సమస్య తలెత్తకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని చెప్పారు. మరో రెండు నెలల వరకు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

* జిల్లాలో 47 పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు 160 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్‌ వివరించారు. కంట్రోల్‌ రూమ్‌ల నుంచి వరదల సమాచారం చేరవేయనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో ముంపు ప్రాంతాలలో ఇప్పటికే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విప్‌ రేగా కాంతారావు మాట్లాడుతూ శాశ్వత ప్రాతిపదికన ముంపు సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రతిపాదనలు అందిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీవో పీవో గౌతమ్‌ మాట్లాడారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని