హెపటైటిస్‌ హెచ్చరికలు
eenadu telugu news
Published : 24/07/2021 02:35 IST

హెపటైటిస్‌ హెచ్చరికలు

వొైరల్‌ లోడు గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలు

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

ఖమ్మం ఆసుపత్రిలో నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

ఆకలి మందగించిందా.. అలసట, నీరసం, కడుపునొప్పి, వాంతులు విరేచనాల సమస్య తలెత్తిందా.. కామెర్లు ఉన్నాయనే అనుమానం కలుగుతుందా.. అయితే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాల్సిందే. పై సమస్యలు దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటైన హెపటైటిస్‌ వైరస్‌ లక్షణాలు కావొచ్ఛు కాళ్లు, పొట్ట వాపు, నీరు చేరడం, రక్తపు వాంతులు, పగలు నిద్ర, రాత్రి మెలకువ, ఆలోచనల్లో తికమక వంటి సమస్యలు దీనికి సూచికలు. జిల్లాలో ఈ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోనే వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని గతంలో ఓ సర్వే తేల్చింది. వ్యాధి బాధితుల్లో వైరల్‌ లోడును అంచనా వేసేందుకు నేషనల్‌ వైరల్‌ హెపటైటీస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం ద్వారా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో శిబిరం ఏర్పాటు చేశారు. అటు తర్వాత మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.

సంక్రమణ వ్యాధి.. కాలేయంపై వైరస్‌ ప్రభావం

హెచ్‌ఐవీ మాదిరిగానే ఈవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. రక్తమార్పిడి, లైంగిక సంబంధాలు, బ్లేడ్లు, టూత్‌బ్రష్‌లు ఒకరివి మరొకరు వాడటం వల్ల వ్యాపించే ప్రమాదం ఉంది. పిల్లలకు చెవులు కుట్టించేటప్పుడు, పచ్చబొట్లు వేయించుకునే సమయాల్లో ఇతరులు వాడిన పరికరాలను వాడటం వల్ల కూడా వస్తుంది. హెపటైటీస్‌ ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌, జి అనే ఏడు రకాలుగా ఉంటుంది. వాటిలో ప్రధానమైన బి, సి వైరస్‌లు ప్రాణాంతక మైనవిగా వైద్య పరిశోధనలు తేల్చాయి. ఇవి దీర్ఘకాలిక కాలేయ సంబంధిత సమస్యలను కలుగచేస్తాయి. లివర్‌ సిరోసిస్‌ సమస్య కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సోకే ప్రమాదం ఉంది. ముందస్తు జాగ్రత్తలే వ్యాధి నివారణకు మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఖమ్మంలో మొదటిసారిగా పరీక్ష

బాధితుల్లో హెపటైటిస్‌ వైరల్‌ లోడును పరీక్షించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో జిల్లాలో తొలిసారిగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్‌ పరీక్షలకు ఉపక్రమించింది. ఇప్పటికే జిల్లాలో గుర్తించిన పాజిటివ్‌ బాధితులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలకు రప్పించి పరీక్షలు చేస్తున్నారు. వారి నుంచి నమూనాలు సేకరించి జిల్లా హెపటైటిస్‌ ల్యాబ్‌లో వ్యాధి నిర్ధారణ అనంతరం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలోని వైరల్‌లోడు పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. అక్కడ ఫలితాల ఆధారంగా తగిన ఔషధాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బాధితులు ఎలాంటి ఆందోళన చెందకుండా మందులు అందుబాటులో ఉన్నాయని అవగాహన కల్పిస్తోంది.

అందుబాటులో ఔషధాలు: -డాక్టర్‌ జంగాల సునీల్‌కుమార్‌, లివర్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులు

చికిత్స కంటే నివారణ విధానంలోనే హెపటైటిస్‌ వైరస్‌ వ్యాప్తిని అదుపుచేయాలి. ముందస్తు పరీక్షలు చేయించుకొని వ్యాధి ఉన్నట్లు తేలితే చికిత్స తీసుకోవాలి. పూర్తిస్థాయి నివారణకు ఆధునిక చికిత్స, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే ప్రాణహాని జరగవచ్ఛు ప్రాథమిక దశలో గుర్తించితగిన ఔషధాలు వాడితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని