హృదయ వేదన
eenadu telugu news
Updated : 24/07/2021 11:56 IST

హృదయ వేదన

గుండెజబ్బుతో ప్రాణాపాయ స్థితిలో యువకుడు

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే

బింగి సంతోష్‌

కన్నవారు కూలీ పనులకు వెళ్తేనే ఆ ఇల్లు గడుస్తుంది. తండ్రి మూర్ఛతో బాధపడుతుండగా, తల్లి కంటిచూపు మందగించింది. ఆ నిరుపేద కుటుంబంలో పుట్టిన యువకుడు గుండెజబ్బు బారిన పడ్డాడు. గుండె మార్పిడి శస్త్రచికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేసే దారిలేక ఆ తల్లిదండ్రుల విలపిస్తున్నారు.

కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన బింగి కృష్ణ, వెంకటరమణ దంపతులకు సంతోష్‌. ఒక కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. తండ్రి సుతారి పని, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంతోష్‌కు 21 సంవత్సరాలు. రెండేళ్లుగా తీవ్రమైన గుండెజబ్బు(అయోర్టిక్‌ స్టినోసిస్‌)తో బాధపడుతున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాదు కిమ్స్‌ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్‌ చేయించారు. అయినప్పటికీ జబ్బు పూర్తిగా తగ్గలేదు. మళ్లీ సమస్య తీవ్రరూపం దాల్చింది. మరోసారి పరీక్షలు చేయించగా, గుండె ఎడమభాగం పూర్తిగా చెడిపోయిందని, గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు తెలిపారు.

శస్త్రచికిత్సకు రూ.25లక్షలు

సంతోష్‌కు శస్త్రచికిత్స చేయించడానికి రూ.25లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ ఎలా చేయించాలో తెలియక ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. సంతోష్‌ మందుల కోసం ప్రతినెలా రూ.5వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. గ్రామంలోని యువకులు కొంతమంది ఒక బృందంగా ఏర్పడి సంతోష్‌ సామాజిక మాధ్యమాల్లో దాతల సహాయాన్ని అర్థిస్తున్నారు. వీరి చొరవతో కొంతమొత్తం సమకూరినా అవి మందులకే సరిపోవడం లేదు. ఇటీవల జిల్లా పాలనాధికారిని కలిసి విన్నవించారు. దాతలు, ప్రభుత్వం స్పందించి తమ కుమారుడికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని