రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృత్యువాత
eenadu telugu news
Published : 24/07/2021 02:23 IST

రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృత్యువాత

ప్రవహించిన వాగులతో సకాలంలో అందని వైద్యం

పాలపాటి నారాయణ,   పద్మావతి

తల్లాడ, న్యూస్‌టుడే: భారీ వర్షాలతో రవాణా సదుపాయాలు స్తంభించి సకాలంలో వైద్యం అందక భార్యాభర్తలు రెండు రోజుల వ్యవధిలో తనువు చాలించారు. ఈ ఘటన తల్లాడ మండలం వెంగన్నపేట పంచాయతీ మువ్వాగూడూరులో చోటుచేసుకుంది. మూడు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో మువ్వాగూడూరు నుంచి చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈనెల 21న పాలపాటి నారాయణ(58) ఛాతీనొప్పి, వాంతులతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనను కల్లూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించేందుకు యత్నించగా అప్పటికప్పుడు వీలుపడలేదు. కొన్ని గంటల తర్వాత వరద ఉద్ధృతి తగ్గాక ఆటోలో కల్లూరుతరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. ఆసుపత్రి వైద్యుడు పరిశీలించి గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. గురువారం ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. భర్త అకాల మరణంతో మనోవేదనకు గురైన పద్మావతి(52) గురువారం సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ సమయంలోనూ ఆలస్యంగా ఆటోలో కల్లూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. మొదడులోని రక్తనాళాలు చిట్లడంతో పద్మావతి మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడైన కిరణ్‌ తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉన్నాడు. తల్లిదండ్రుల అకాల మృతితో కిరణ్‌ ఒంటరివాడయ్యాడు. ఒకే కుటుంబంలోని ఇద్దరి మృతితో మువ్వాగూడూరులో విషాదం అలుముకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని