కట్టుకున్నోడే కడతేర్చాడు
logo
Published : 24/06/2021 04:52 IST

కట్టుకున్నోడే కడతేర్చాడు

గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపిన వైనం


భర్త శ్రీనివాసరావుతో చంద్రకళ

మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని ప్రతి యువతి కోరుకుంటుంది. ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అలాంటి యువతులు కుటుంబ కలహాల కారణంగా భర్త చేతుల్లో దారుణ హత్యకు గురవుతున్నారు. మణుగూరు పట్టణంలో శీలం చంద్రకళ(26) భర్త చేతిలో హత్యకు గురైంది. పట్టణంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి..

మణుగూరు పట్టణంలో సుందరయ్య నగర్‌కు చెందిన శీలం నాగేశ్వరరావు ఇటీవల కరోనా కారణంగా మరణించాడు. అతనికి భార్య రూపవతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన శీలం శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన చంద్రకళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వృత్తిరీత్యా శ్రీనివాసరావు అమలాపురంలోనే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి దశదిన కర్మ నిర్వహించేందుకు భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మణుగూరుకు వచ్చాడు. మూడ్రోజుల క్రితం కార్యక్రమాలను బంధువుల సమక్షంలో జరిపించాడు. బంధువులు కూడా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో శ్రీనివాసరావు తన భార్యను గొడ్డలితో నరికి చంపి, అనంతరం ప్రహరీ దూకి పారిపోయాడు. తెల్లవారుజామున పక్కగదిలో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులు తలుపు తీసి చూడగా రక్తపు మడుగులో చంద్రకళ నిర్జీవంగా కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భానుప్రకాశ్‌, ఎస్సై నరేశ్‌... చంద్రకళ మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరుపై ఆరా తీశారు. డాగ్‌ స్క్వాడ్‌తో ముమ్మరంగా తనిఖీ చేపట్టారు. సీఐ మాట్లాడుతూ నిందితుడు పరారీలో ఉన్నాడనీ, విచారణ చేస్తున్నామన్నారు. మృతురాలి తరఫున ఎవరూ ఫిర్యాదు చేయలేదనీ, అయినప్పటికీ పూర్తిస్థాయి విచారణ చేస్తామన్నారు.

* రాత్రి గోరుముద్దలు తినిపించి నిద్రపుచ్చిన తల్లి తెల్లవారేసరికి విగతజీవిగా మారిన తీరును ఇద్దరు కుమారులు రిషి, శశి అమాయకంగా చూస్తుండిపోయారు. దంపతులు ఇక్కడ అన్యోన్యంగా ఉన్నారనీ, పూర్వ తగాదాలు, ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


తల్లి ప్రేమకు దూరమైన రిషి, శశి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని