Published : 16/05/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమున్నత ప్రయోగం సఫలమయ్యేనా?

ఒకే ఒక్కచోట ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’ పూర్తి

మిగిలిన 15 ఉన్నత పాఠశాలల్లో పనుల్లో జాగు

కొత్తగూడెం విద్యావిభాగం, చంద్రుగొండ న్యూస్‌టుడే

నూతన ఆవిష్కరణల దిశగా ఔత్సాహికులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ‘నీతి ఆయోగ్‌’ ఆధ్వర్యాన అమలు చేస్తున్న పథకమే ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌(ఏఐఎం)’. ఇందులో భాగంగా విద్యాలయాల్లో ‘అటల్‌ టింకరింగ్‌’(ఏటీఎల్‌)’ పేరిట ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆసక్తి ఉన్న జిల్లాలోని విద్యాలయాల నుంచి ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించారు. సైన్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు, ప్రయోగ విద్యకు మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో జిల్లా నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు దరఖాస్తులు చేశాయి. గత మూడేళ్లలో రెండు దశల్లో 16 పాఠశాలలు పథకం కింద అర్హత సాధించాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ వివరాలు ప్రకటించారు. ఎంపికైన విద్యాలయానికి రూ.20 లక్షల వరకు నిధులను అందిస్తారు. మొత్తం 16 పాఠశాలలకు రూ.3.2 కోట్లను కేటాయిస్తున్నట్లు మిషన్‌ అధికారులు తెలిపారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. కానీ మూడేళ్లుగా చాలాచోట్ల ల్యాబ్‌లు ప్రారంభానికి నోచుకోవడం లేదు. కేవలం ఒకేచోట, అదీ.. చంద్రుగొండ జడ్పీహెచ్‌ఎస్‌లో మాత్రమే ప్రయోగశాలను పూర్తిచేశారు. మిగిలినన్నీ వివిధ దశల్లో నిలిచిపోయాయి. వాటి అంశం చర్చకు వచ్చిన ప్రతీసారి సమీక్షలు జరుపుతున్నట్లు విద్యా శాఖాధికారులు పేర్కొంటున్నారు. కానీ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తేనే మిగతా పాఠశాలలకూ నిధులు వచ్చే అవకాశం ఉందని పలువురు సైన్సు ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. ప్రయోగశాలలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇప్పుడున్న సాధారణ ప్రయోగశాలల కంటే అత్యాధునిక ఉపకరణాలు ‘ఏటీఎల్‌ ల్యాబ్‌’లో ఉండటం విద్యార్థులకు ఎంతో ఆసక్తిని కలిగించే అంశంగా గుర్తుచేస్తున్నారు. ఫలితంగా ఇన్‌స్పైర్‌ మనాక్‌, ఇతర వైజ్ఞానిక ప్రదర్శనల్లో రాష్ట్ర, జాతీయ స్థాయికి ప్రాతినిధ్యాలు మరింత పెరిగే వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మూడేళ్లు కావస్తోందని, మరింత ఆలస్యమైతే నిధులు కూడా వెనక్కి మళ్లే అవకాశం ఉందనే ఆందోళన విద్యావర్గాల్లో వ్యక్తమవుతోంది.

ప్రయోగశాల స్వరూపం

రూ.20 లక్షల నిధులతో ఏర్పాటు చేసే ప్రయోగశాలలో రూ.10 లక్షలు నిర్మాణం, ఉపకరణాల కొనుగోలుకు వెచ్చించాలి. తొలి ఏడాది రూ.2 లక్షలు నిర్వహణకు వినియోగించాలి. ఆ తర్వాత మిగిలిన 8 లక్షలను ఏటా రూ.2 లక్షల చొప్పున విడతల వారీగా పాఠశాలల బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. 2018-19 విద్యా సంవత్సరంలో ఇన్‌ఛార్జి హెచ్‌.ఎం.గా ఉన్న డి.నరసింహారావు చంద్రుగొండ జడ్పీహెచ్‌ఎస్‌లో ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’కు రూ.12 లక్షలు మొదటి విడత నిధులు వచ్చేందుకు కృషిచేశారు. ఆ వెంటనే నిబంధనల ప్రకారం పనులు పూర్తిచేయించారు. ఇదొక్కటి మినహా మరెక్కడా ప్రయోగశాలలను పూర్తి చేయించలేదు.

ఏటీఎల్‌ మంజూరైన ఉన్నత పాఠశాలలు

2018-19లో: చంద్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, రామానుజవరం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు సింగరేణి ఉన్నత పాఠశాలలు, టీడబ్ల్యూఆర్‌ఐఈఎస్‌-కిన్నెరసాని, టీడబ్ల్యూఆర్‌ఐఈఎస్‌ (బాలికలు)-భద్రాచలం, ఉప్పుసాక ఆశ్రమ పాఠశాల, త్రివేణి పాఠశాల(కొత్తగూడెం).

2019-20లో: జడ్పీఎస్‌ఎస్‌-మణుగూరు, ఏజీహెచ్‌ఎస్‌-అంకంపాలెం, టీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌-ఇల్లెందు, ఎక్స్‌లెంట్‌ స్కూల్‌-మణుగూరు, దమ్మపేట జడ్పీఎస్‌ఎస్‌.

వచ్చే విద్యా సంవత్సరం కల్లా పూర్తి

సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖాధికారి

అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌(ఏటీఎల్‌)లను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాం. మంజూరైన పాఠశాలల బాధ్యులతో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ సమీక్ష కూడా నిర్వహించాం. ఏఏ దశల్లో పనులు ఉన్నాయో గుర్తించి.. వాటిని పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని