Published : 16/05/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్పత్రులు అధ్వానం


ప్రైవేటు ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో బృందం

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణ తీరు అధ్వానంగా ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ఈనాడు’ వరుస కథనాలతో అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని సీ-స్టార్‌, ప్రశాంతి హాస్పిటల్స్‌ను ఆరోగ్య శాఖ అధికారుల బృందం సందర్శించారు. కొవిడ్‌ వార్డుల్లో అనుమతులకు మించి మంచాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేల్చారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టికలతో బోర్డులను ఏర్పాటు చేయకపోవడంపై డీఎంహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచాలు, ఐసీయూ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, హెచ్‌ఆర్‌సీటీ, పీపీఈ కిట్‌లకు ప్రత్యేకంగా ధరలు నిర్ణయించినా ఎందుకు పట్టించుకోవడం లేదని యాజమాన్యంపై మండిపడ్డారు. తాము ధరల విషయంలో గతంలోనే సర్క్యులర్‌ జారీ చేసినా స్పందించలేదని అన్నారు. హాస్పిటల్స్‌లో వెలువడే గార్బెజ్‌ను విధిగా తొలగించకుండా నిల్వ చేశారని, బయోవ్యర్ధాల కారణంగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య నిపుణులు లేకుండా ప్రచార బోర్డులు ఎలా ఏర్పాటు చేశారని నిలదీశారు. అర్హత లేని వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు పరిశీలనలో తేలిందని ఆమె చెప్పారు. మంచాలకు తగిన స్థాయిలో సిబ్బంది లేరన్నారు. ఆక్సిజన్‌ కొరత పేరుతో రోగులను బయటకు పంపిస్తే సహించేది లేదన్నారు. అనుమతులకు మించి అడ్మిషన్లు తీసుకొని వైద్యం చేయకుండా రోగులకు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ,్చరించారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే విషయంలో కనీస ప్రమాణాలు, నిబంధనలు పాటించడం లేదని తేల్చారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కోసం హెటిరో డ్రగ్స్‌సంస్థ వద్ద రిజిష్టరు చేసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. నిర్వహణ లోపాలను గుర్తించిన ఆస్పత్రులపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని