Published : 16/05/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ముల్లు’ ముడిచిన దోమ

కరోనా దెబ్బకు తగ్గుముఖం

నేడు డెంగీ నివారణ దినం

ఖమ్మం వైద్యవిభాగం, భద్రాచలం, న్యూస్‌టుడే

కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగింది. మరోవైపు వ్యాధి నిరోధకశక్తి పెంచుకుంటున్నారు. దీంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ పరిణామాలు దోమల ఉద్ధృతి తగ్గడానికి కారణాలయ్యాయి. వెరసి ఏటా ఉమ్మడి జిల్లా వాసులను వణికించే డెంగీ జ్వరాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే ఒరవడి నిరంతరం కొనసాగిస్తే ప్రాణాంతక దోమకాటు నుంచి జనాన్ని కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వర్షాకాలానికి ముందే అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరముంది. కాగా గత ఏడాది కేసుల నమోదు పెద్దగా లేకపోవడంతో అధికార యంత్రాంగం నివారణపై అంతగా దృష్టి సారించాల్సిన అవసరం లేకపోయింది. ఈ ఏడాది ఎలాంటి స్థితి ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నివారణ చర్యలు చేపట్టే క్రమంలో ప్రతి ఏడాది మే 15న డెంగీ నివారణ దినంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.

పగటిపూట దోమకాటు

ఖమ్మం జిల్లాలో 2017 నుంచి 2019 ఏటా డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. సహజంగా ఆగస్టు నుంచి మొదలై డిసెంబర్‌ వరకు వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శుభ్రమైన నీటిలో ఏడీస్‌ ఈజీప్టీ అనే దోమ పుడుతుంది. అది పగటి పూట స్వైరవిహారం చేస్తుంది. ఈ క్రమంలో మనుషులపై దాడి చేస్తూ అనారోగ్యం పాల్జేస్తుంది. ఏటా అధికారిక లెక్కల ప్రకారం ఏడు వందల మందికి పైగా డెంగీ కారణంగా మంచం పడుతున్నారు. డెంగీ జ్వరం కారణంగా వేగంగా రక్తఫలకికలు(ప్లేట్‌లెట్లు) తగ్గిపోవడంతో ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. భద్రాద్రి జిల్లాలో ఈసారి ఆళ్లపల్లి, రామవరం పరిధిలో ఒకొక్కటి రాగా మణుగూరు 3, నర్సాపురం 2 కేసులు నమోదయ్యాయి.

మన్యంలో దోమతెరలు

భద్రాద్రి జిల్లాలో 1.63లక్షల దోమతెరలు తమిళనాడు నుంచి తెప్పించారు. ఇవి మూడేళ్లపాటు మన్నుతాయి. ఇప్పటికే ఎంపిక చేసిన 27 పీహెచ్‌సీల పరిధిలోకి వీటిని చేర్చారు. 274 గ్రామాలకు అందించాల్సి ఉంది. వచ్చే నెల 15 నుంచి మొదటి దశ, ఆగస్టులో రెండో దశ దోమల మందు మొదటి దశ పిచికారి ఉంటుంది.

నివారణ చర్యలే ముఖ్యం

ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పారబోయడమే మొదటి నివారణ చర్య అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించి కొబ్బరి చిప్పలు, టైర్లు, కుండ పెంకులను ఇంటి ఆవరణలో లేకుండా చూడాలి. దోమలు వృద్ధి చెందకుండా గంబూషియా చేప పిల్లలను పెంచి అవసరమైన చోట వదలాల్సి ఉంది. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ దోమల వ్యాప్తిని అరికట్టాలి. దోమలు కుట్టకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. దోమ తెరలపై అవగాహన పెంచాలి.

డెంగీ నిర్ధారణకే రూ.వేలల్లో ఖర్చు

వ్యాధి నిర్ధారణ కోసమే వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు వైద్యరంగానికి ఈ జ్వరం వ్యాపార వనరుగా మారుతోంది. కొంత మంది ప్రయివేటు ల్యాబుల నిర్వాహకులు పరీక్షలు చేసి డెంగీ వచ్చినట్లు నివేదికలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిబంధనలను అనుసరించి ఎలీసా పరీక్ష ద్వారా పాజిటివ్‌ ఉందా లేదా అన్నది నిర్ధారిస్తున్నారు. ఇలాంటి ప్రమాణాలు పాటించే పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కేసులు తగ్గాయి

సాధనాల సంధ్య, డీఎంవో, ఖమ్మం

డెంగీ కేసులు పెద్దగా రావడం లేదు. కరోనా కారణంగా తగ్గాయనే చెప్పవచ్ఛు పరిసరాలను విధిగా శానిటేషన్‌ చేయిస్తున్నాం. ఫాగింగ్‌ చేస్తూ దోమల వ్యాప్తిని అరికడుతున్నాం. డెంగీ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య కూడా తగ్గింది. ఈ ఏడాది దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కార్యాచరణ కొనసాగిస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని