Updated : 21/04/2021 04:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వకీల్‌సాబ్‌తో మనమ్మాయి..

సినీరంగంలో రాణిస్తున్న జిల్లావాసి అనన్య నాగళ్ల

వేంసూరు, న్యూస్‌టుడే: ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ముఖ్యంగా చలన చిత్ర రంగంలో రాణించాలంటే అసాధారణ ప్రతిభ ఉండాల్సిందే. చిత్రసీమలో కథానాయిక పాత్రలకు తెలుగువారి కంటే పరభాషా నాయికలకే తొలి ప్రాధాన్యం. అడపాదడపా ఎవరైనా ఆ వైపుగా ప్రయత్నించిన సందర్భాల్లోనూ అవకాశాలు దక్కించుకొని విజయవంతమైన నటీమణులు తక్కువనే అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో ఖమ్మం జిల్లాకు చెందిన అనన్య నాగళ్ల ఒక్కోమెట్టు రాణిస్తోంది. నటించినవి తక్కువ సినిమాలే అయినా.. మూడో చిత్రంతోనే ‘వకీల్‌సాబ్‌’లో పవన్‌కల్యాణ్‌తో నటించే అవకాశం దక్కించుకొంది.
ఇదీ నేపథ్యం.. అనన్య తల్లిదండ్రులది పెనుబల్లి మండలం లంకపల్లి.  బాల్యంనుంచి  వేంసూరు మండలం లింగపాలెంలో అమ్మమ్మ గారి ఇంటివద్దే పెరిగింది. లింగపాలెంలో ఉంటూ సత్తుపల్లిలో ఇంటర్‌ చదివింది. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసింది. అనంతరం నటనపట్ల ఆసక్తి పెంచుకొని మణికొండలో యాక్టింగ్‌ స్కూలులో నటనలో మెలకువలు నేర్చుకుంది. తొలుత లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. ఆమె నటించిన ‘షాదీ’ అనే లఘుచిత్రం సైమా అవార్డుకు ఎంపికైంది. అక్కడా సత్తా చాటాక సినిమాల అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ సమయంలో తెలంగాణా చేనేత కార్మికుల నేపథ్యంలో నిర్మించిన ‘మల్లేశం’ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. ఆ సినిమాలో తెలంగాణా కట్టు బొట్టు, యాస, సంప్రదాయంతో సహజత్వంతో నటించి మెప్పించింది. ఆ తర్వాత ‘ప్లేబ్యాక్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అనంతరం పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో కీలక పాత్ర దక్కించుకొంది. ఈ పాత్ర అనన్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నటించే మరో అవకాశాన్ని దక్కించుకొంది.
నటనకు అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యం: అనన్య పాత్రలో ఒదిగిపోయే తెలుగమ్మాయిలకు ప్రోత్సాహం ఉందని, అందుకు తానే ఉదాహరణ. ‘మల్లేశం’ చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. నటనకు అవకాశం ఉన్న కథలనే ఎంచుకోవాలనులకుంటున్నాను. కుటుంబంలో చిన్నా, పెద్దా అందరూ కలిసి చూడదగిన కథా ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటాను. సినీరంగంలో రాణించేందుకు ప్రతిభ తప్పనిసరి.. అది ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని