రథంపై ఊరేగిన స్వామివార్లు
eenadu telugu news
Published : 21/10/2021 02:26 IST

రథంపై ఊరేగిన స్వామివార్లు

సిరిసిల్లలో రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో మహా రథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు దేవదేవుడ్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తొమ్మిదిరోజుల పాటు సర్వంగా సుందరంగా అలంకరితుడైన వేంకటేశ్వరస్వామి వివిధ వాహనాలలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తకోటి జనం తరలివచ్చారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల తరహానే సిరిసిల్లలోనూ వేంకటేశ్వరస్వామిని వాహనాలలో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా పేరుగాంచిన శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం అట్టహాసంగా జరిగింది. సుమారు 35 వేల మంది వరకు భక్తులు వేడుకలలో పాల్గొన్నట్లు అంచనా. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వేడుకలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటల నుంచి భక్తుల రద్దీ ప్రారంభమైంది. రథంపైకి ఎక్కి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం ఉదయం 5 గంటలకు హోమం, 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు రథంపై స్వామివారి దర్శనం, మొక్కుల చెల్లింపులు జరిగాయి. సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు, రాత్రి 10 గంటలకు అశ్వవాహనంపై దోపుకథ జరిగాయి. సిరిసిల్ల పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ ఛైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్‌, ఆలయ ఈవో నాగారపు శ్రీనివాస్‌, అధ్యక్షుడు ఉప్పల విఠల్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు కోడం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

దర్శనానికి వరుసలో ఉన్న భక్తులు

ఉత్సవమూర్తులకు అలంకరణ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని