నాన్న ఆశయం.. తనయుడి విజయం
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

నాన్న ఆశయం.. తనయుడి విజయం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నేడు


సాయికుమార్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే : తండ్రి మరణించినా కుంగిపోలేదు.. పోలీసు విధులంటే భయపడలేదు.. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నాడే తప్ప దానికి దూరంగా వెళ్లాలనుకోలేదు.. బాల్యంలో తండ్రిని కోల్పోయిన బాధ.. కళ్ల ముందే తండ్రి మృతదేహం కనిపిస్తున్నా ఆ సమయంలో ఏం చేయాలో తెలియని బాల్యం.. కొద్ది కొద్దిగా వయసు పెరిగే కొద్ది తండ్రి ఆశయం గుర్తుకు వచ్చింది. పోలీసు ఉద్యోగంలో చేరాలన్న పట్టుదల పెరిగింది. చిన్నతనం నుంచే కష్టపడి చదువుతూ ఎస్‌ఐ కొలువు సాధించారు జి.సాయికుమార్‌. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా ముథోల్‌ ఠాణా ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన జి.శేషయ్య బెల్లంపల్లిలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల క్రితం మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్న శేషయ్య మరణం తర్వాత అతని భార్య శోభారాణికి నీటిపారుదల శాఖలో ఉద్యోగం కల్పించారు. పిల్లలను చదివిస్తూ కూతుళ్ల పెళ్లిల్లు చేసిన శోభారాణి కుమారున్ని మాత్రం పోలీసు ఉద్యోగం వైపు ప్రోత్సహించింది. దీంతో సాయికుమార్‌లో పట్టుదల పెరిగింది. కరీంనగర్‌లో పదో తరగతి వరకు చదివిన సాయికుమార్‌ హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తి చేశారు. బీటెక్‌ చేవెళ్లలో పూర్తి చేసిన సాయికుమార్‌ రెండు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. పోలీసు ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రకటన రావడంతో ప్రయత్నించారు. 2020 బ్యాచ్‌ ఎస్‌ఐగా ఎంపికైన సాయికుమార్‌ ప్రస్తుతం ముథోల్‌ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి మరణం తర్వాత పోలీసు ఉద్యోగం చేయాలన్న పట్టుదల పెరిగిందని సాయికుమార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తన తండ్రి చనిపోయి 20 ఏళ్లు గడిచిన ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు గుర్తు చేసుకోవడం లాంటి సేవ ఎవరికి దక్కుతుంది.. కేవలం త్యాగధనులకే ఈ అవకాశం ఉంటుందన్నారు. పోలీసు శాఖ ఉన్నన్ని రోజులు మా నాన్న పేరు ఏటా గుర్తు చేసుకుంటారని తెలిపారు.


రక్తదానంతో ప్రాణాలు కాపాడే అవకాశం


రక్తదానం చేస్తున్న సీఐ రాజ్‌కుమార్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే : రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని డీసీపీ రవీందర్‌, అడ్మిన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌లు వెల్లడించారు. గోదావరిఖని సబ్‌ డివిజన్‌ పోలీసులు, ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం స్థానిక ఆర్‌సీఓఏ క్లబ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా పది రోజులుగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రక్తదానం చేయడం వల్ల ఇతర రోగులకు అందించే అవకాశం ఉంటుందన్నారు. పోలీసులతో పాటు సామాజిక కార్యకర్తలు, పోలీసు కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు, పోలీసు హితులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తనిధి కేంద్రాలకు పోలీసు శాఖ సహకారం అందించేందుకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఖని ఏసీపీ గిరి ప్రసాద్‌, స్పెషల్‌ బ్రాంచి ఏసీపీ నారాయణ, ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌రావు, సీఐలు రమేశ్‌బాబు, రాజ్‌కుమార్‌, సతీష్‌, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, ఆర్‌ఐలు మధుకర్‌, శ్రీధర్‌, విష్ణుప్రసాద్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని