ఉద్యోగాలు ఇప్పిస్తామని ఘరానా మోసం
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఘరానా మోసం


పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: సింగరేణిలో మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయిస్తామని, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ట్రేడింగ్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని మాయమాటలు చెప్పి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనేక మందిని మోసం చేసిన ఘరానా మోసగాళ్లను మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల చేతిలో మోసపోయిన మందమర్రికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బండారం బయటపడింది. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ వివరాలను తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ మరో ఇద్దరు వ్యక్తులు మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడకు చెందిన రాజా జ్ఞానసాగర్‌, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన రవికాంత్‌ శర్మతో కలిసి భారీ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. గతంలో హోటల్‌ వ్యాపారం చేసిన శ్రీనివాస్‌గౌడ్‌ డబ్బులు సరిపోకపోవడంతో తేలికగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఈ క్రమంలో రవికాంత్‌శర్మతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సింగరేణి కార్మికులకు మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేయాలని పథకం రచించి.. రాజ జ్ఞానసాగర్‌ అనే మరో వ్యక్తిని నియమించుకున్నారు. ముగ్గురు కలిసి మంచిర్యాల, మందమర్రి, సీసీసీలతో ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, మణుగూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన సింగరేణి ఉద్యోగులకు మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయిస్తామని, నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని, యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ట్రేడర్స్‌లో పెట్టుబడులు పెట్టాలని, ఇసుక వ్యాపారం చేసేందుకు ఒప్పించి అమాయకులను నమ్మించి లక్షలు తీసుకున్నారు. మందమర్రి, మంచిర్యాలకు చెందిన నలుగురు వ్యక్తుల వద్ద రూ.25,20,000 కాజేశారు. దీంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 26 మంది వద్ద రూ.1.36 కోట్లు కాజేసినట్లు ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ఈ ముగ్గురిపై సీసీసీ నస్పూర్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు తెలిపారు. నిందితుల వద్ద ఆల్‌ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌కు చెందిన నకిలీ గుర్తింపుకార్డు, యాదగిరి లక్ష్మీనర్సింహాస్వామి ట్రేడర్స్‌కు చెందిన నకిలీ లెటర్‌హెడ్‌ పత్రాలు, వివిధ రకాల విజిటింగ్‌ కార్డులు, చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ సంజీవ్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఏఎస్‌ఐ జితేందర్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని