పత్తిధరకు రెక్కలు
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

పత్తిధరకు రెక్కలు

క్వింటాల్‌కు రూ. 7311 నమోదు

న్యూస్‌టుడే,పెద్దపల్లి


మార్కెట్‌కు వచ్చిన పత్తి

పత్తి ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ మద్దతు ధర ఆధారంగానే పంటలు సాగుచేస్తున్న రైతులు పదేళ్ల గడ్డు కాలాన్ని దాటేందుకు పెరుగుతున్న ధరలు ఊతమిస్తున్నాయి. గతానికి భిన్నంగా ప్రైవేటు వ్యాపారుల ధరలను సీసీఐకి అందకుండా దూసుకుపోవడంతో పత్తిరైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. సీసీఐ మద్దతు ధరకు వేయి రూపాయలు అధికంగా క్వింటాల్‌ పత్తికి రూ. 7000 పైచిలుకు ధరలు నమోదవుతున్నాయి. పెద్దపల్లి మార్కెట్‌లో మంగళవారం అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 7311 ధర పలికింది. జమ్మికుంట మార్కెట్‌లో రూ. 7330, వరంగల్‌లో రూ. 7309 ధరలు నమోదయ్యాయి. గత సెప్టెంబర్‌ నెలాఖరులో క్వింటాల్‌ ధర రూ. 7800 వరకు ధర పలికింది. ఈధరల సరళి ఇలాగే కొనసాగితే ఈనెలాఖరు నాటికి ధరల మరింతగా పెరిగే అవకాశముంది.

సీసీఐ ధర చెరిగిపోయింది

సీసీఐ ధర జిల్లాలో లభించిన పత్తి నాణ్యతను బట్టి ఈసీజన్‌లో రూ. 6025 నిర్ణయించారు. కానీ ధరలు రూ. 7000కు పైగా పలుకుతుండడంతో సీసీఐ ప్రమేయానికి అవకాశం లేకుండా పోయింది. ఇన్నాళ్లు సీసీఐ కొనుగోలు కేంద్రాలలోనే వారిచ్చిన ధరను నమ్ముకొని, రైతులు పత్తిని అమ్ముకున్నారు. నాణ్యత తక్కువగా ఉండడం, తేమ శాతం ఎక్కువగా ఉన్న సందర్భాలలో మార్కెట్‌లలో పత్తిని ఆరబోసి విక్రయించిన సందర్భాలున్నాయి. ఈక్రమంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్రం రూపకల్పన చేసినా నామ్‌ విధానం కూడా ఎలాంటి ప్రయోజనం కల్పించలేకపోయింది. కేవలం సీసీఐ అధికారుల దయపైనే రైతులకు మద్దతు లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పత్తికి పెరిగిన డిమాండ్‌తో ప్రైవేటు కొనుగోలుదారులు మార్కెట్‌కు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సీజన్‌లో మార్కెట్‌లలో సీసీఐ నిర్ణయించిన ధర చెరిగిపోయినట్లయింది. నవంబర్‌, డిసెంబర్‌లలో నాణ్యమైన పత్తి మార్కెట్‌కు వస్తుంది. అప్పటి వరకు ధరల పురోగమనం ఇలాగే కొనసాగితే పత్తి ధర ఐదెంకెల స్థాయికి చేరుకునే అవకాశముందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రచారంతోనే ప్రయోజనం

గత కొన్నేళ్లుగా పత్తిధరలు పడిపోవడంతో నైరాశ్యం నిండిన రైతులు ఈ ఏడాది పత్తిసాగును తగ్గించారు. గత ఏడాదితో పోల్చితే జిల్లాలో పదివేల ఎకరాల్లో పత్తిసాగు తగ్గిపోయింది. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలు రైతులకు పూర్తిస్థాయిలో దక్కేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాల్సిన బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది. మార్కెట్లు, జిన్నింగ్‌ మిల్లులలో ధరలు అధికంగా ఉన్నాయనే ప్రచారం రైతుల వరకు వెళ్లకపోవడంతో ఇప్పటికే పలు గ్రామాల్లో దళారీలు రంగప్రవేశం చేసి, గ్రామాల్లోనే కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా జరిగే కొనుగోళ్లలో తూకంతో పాటు ధరల్లో కూడా రైతులకు నష్టం కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో దళారులు చేసిన మోసాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో రైతులకు పెరిగిన ధరను దక్కే విధంగా మార్కెట్‌ అధికారులతో పాటు వ్యవసాయ అధికారులు కూడా ప్రచారం చేయాల్సిన అవసరముంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని