ప్రాజెక్టుల పేరిట పేదల భూములు లాక్కున్నారు
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

ప్రాజెక్టుల పేరిట పేదల భూములు లాక్కున్నారు

తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం


జగదేవుపేటలో నిర్వాసిత రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న కోదండరాం

వెల్గటూరు, న్యూస్‌టుడే : ప్రాజెక్టుల నిర్మాణం పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఎకరాల చిన్న సన్నకారు రైతుల భూములు లాక్కున్నారని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. కాళేశ్వరం లింక్‌-2 నిర్మాణం పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంపును కోరుతూ బుధవారం జగదేవుపేటలో బాధిత రైతులతో కలిసి భూసాధన సమితి, అఖిలపక్షాల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించతలపెట్టారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆటంకం ఏర్పడింది. దీంతో రైతులతో కలిసి గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకునే అవకాశం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2014 నుంచి రైతులు తమ భూములు ఇవ్వకుండా గట్టిగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఫార్మాసిటీ, నిమ్స్‌ వంటి వాటికి అక్కడి రైతులు భూములు ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడం వల ముందుకు సాగడం లేదన్నారు. రైతాంగం ఈ విషయాన్ని గ్రహించి అడ్డగోలు ధరలకు ప్రభుత్వానికి భూమి అప్పగించి చేతులు దులుపుకోవద్దని సూచించారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన భూ నిర్వాసితుల సమావేశానికి ఈ ప్రాంతం నుంచి హాజరుకావాలని పిలుపునిచ్చారు. రైతులంతా హక్కుల సాధనకు కలిసి కట్టుగా ఉండాలని, తాము అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు లేకపోయినా ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే వెల్గటూరు, ధర్మారం మండలాల్లో రైతులు వేలాది ఎకరాల భూములు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ జనసమితి నేతలతో కలిసి లింక్‌-2 నిర్మాణం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, తెజస జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, నాయకులు కంతి మోహన్‌రెడ్డి, రామగిరి సంతోష్‌, చింతకుంట శంకర్‌, ఎలుక కమలాకర్‌, ఏనుగు మల్లారెడ్డి, మోటపల్కుల వెంకట్‌, మార్వాడి సుదర్శన్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి , భాజపా నాయకులు కొమ్ము రాంబాబు, మల్యాల దేశ్‌ముఖ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని