ఉద్యోగుల ప్రచారం.. అపచారమే..!
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

ఉద్యోగుల ప్రచారం.. అపచారమే..!

 ప్రభుత్వ సిబ్బంది తీరుపై నిఘా

తపాలా ఓట్లపై యంత్రాంగం దృష్టి

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ - న్యూస్‌టుడే, హుజూరాబాద్‌

కీలకమైన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలను ఉన్నతాధికారులు సవాలుగా స్వీకరిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఇక్కడి ఎన్నికల నిర్వహణ విషయంలో ఎక్కడా లోటుపాటు లేకుండా పారదర్శక పంథాలో పోలింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న పాలనాధికారి ఆర్వీకర్ణన్‌తోపాటు హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఇప్పటికే పలు శిక్షణల్ని విధుల్లో పాల్గొనే సిబ్బందికి కొనసాగించారు. ఇప్పటికే అక్కడక్కడ ఉప ఎన్నికల నిర్వహణపరంగా ఎదురవుతున్న ఇక్కట్లను అధిగమించేందుకు అవసరమైన వ్యూహాల్ని ఆచరణలో చూపించబోతున్నారు. ఇందుకోసం ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నారు. ప్రత్యేక నిఘా విభాగాల్ని ఏర్పాటు చేయించడంతోపాటు లోటుపాట్లపై అందుతున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పైగా కేంద్ర పరిశీలకులు జిల్లా కేంద్రంలో ఉండి పర్యవేక్షణ పెంచుతున్న తరుణంలో సిబ్బంది పాత్రపైన ప్రత్యేక నజర్‌ పెడుతున్నారు.

వేటు వేయడం ఖాయమే..

ఉప ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా పాల్గొన్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యల్ని తీసుకునేలా యంత్రాంగం అప్రమత్తమైంది. గెలుపు ఓటములపై పరోక్ష ప్రభావాన్ని చూపగల వీరి వ్యవహారంపై నజర్‌ వేస్తున్నారు. ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు ఎక్కడైనా తమకు అనుకూలంగా ఉన్న పార్టీ గెలుపునకు సహకారం అందించేందుకు ఎవరు ప్రయత్నించినా వారిపై సస్పెన్షన్‌ వేటును వేయబోతున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చిన కొందరు అధికారుల ఆగ్రహానికి బలై ఉద్యోగానికి దూరమయ్యారు. ఇప్పుడు హుజూరాబాద్‌ విషయంలోనే ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేపట్టినా.. ఇక్కడ విధుల్లో ఉండే వారి నడవడికపై నిఘా పెడుతున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు పోస్ట్‌లు పెట్టినట్లు తమ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమయ్యారు. పోలింగ్‌ రోజున కూడా దివ్యాంగులు, నిరక్షరాస్యులు, వృద్ధులకు ఫలానా గుర్తుకు ఓటేయమని చొరవ చూపినట్లు ఈసీ దృష్టికి వచ్చినా వేటు వేయడం ఖాయమే.!

822 మంది ఓటర్లకు అవకాశం

ఈ సారి ఇక్కడి ఎన్నికల్లో 822 మంది తపాలా ఓటు హక్కు రూపంలో అవకాశాన్ని అందుకుంటున్నారు. భారత ఎన్నికల కమిషన్‌ 80 సంవత్సరాలపైబడిన ఓటర్లు, దివ్యాంగులకు తపాలా ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటునిచ్చారు. వీరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండానే ఎన్నికల సిబ్బంది పోలీసుల సంరక్షణలో, వీడియోగ్రఫీ బృందాలు వెంటవెళ్లి ఇంటి వద్దనే వీరు ఓటును వేసేలా ఈసారి చర్యల్ని తీసుకుంటున్నారు. ఇలా వీరి ఓట్ల కోసం ఎన్నికల అధికారులు ముందుగానే షెడ్యూల్‌ వేసుకుని ఆ ప్రకారం వెళ్లి ఓటర్లను కలువనున్నారు. ఈ తరహా ఓటింగ్‌ విధానంపై ఇదివరకే రాజకీయ పార్టీ నాయకులకు, ఏజెంట్లకు అవగాహన కల్పించారు. బ్యాలెట్‌ పత్రాల్ని వారి ఇంటి వద్ద ఇచ్చి అక్కడే రహస్యంగా ఓటు వేసేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ ఓట్ల విషయంలోనూ ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి వారు ఆకస్మిక తనిఖీలు చేసేలా నిఘా పటిష్ఠం చేస్తున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని