మన ఉత్పత్తులు.. ఆన్‌లైన్‌లో విక్రయాలు
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

మన ఉత్పత్తులు.. ఆన్‌లైన్‌లో విక్రయాలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌


తయారు చేసిన ఫిలిగ్రీ కొంగు పిన్నులు

ఒకప్పుడు మహిళా సంఘాలు రుణం తీసుకొని.. ఇంటి అవసరాలు తీర్చుకునేందుకే ఆసక్తి చూపించే వారు.. ఇప్పుడు తీసుకున్న రుణాన్ని పెట్టుబడిగా పెట్టి ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు.. అంతేకాదండీ తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించుకునేలా వాణిజ్య సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మరింత తోడ్పాటు అందిస్తుండటంతో దానిని అందిపుచ్చుకునేందుకు ముందుకొస్తున్నారు.

కరీంనగర్‌ మెప్మా ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాధుల కేంద్రం ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి జాతీయస్థాయిలో సొంచిరియా పేరుతో వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెంచుకునే సంఘాలను చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారి ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించారు. కొందరు స్వశక్తి సంఘాల్లోని మహిళలు ప్రారంభించిన టైలరింగ్‌, ఫిలిగ్రీ, బోటిక్‌, హాండ్లూమ్స్‌, ఫొటో ఫ్రేం వస్తువులు, తినే ఆహార పదార్థాలు కూడా దేశ, విదేశాల వరకు విక్రయిస్తున్నారు.

ఆర్డర్‌ ప్రకారం కుట్టి సిద్ధంగా ఉంచిన దుస్తులు

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు

అంతర్జాతీయ మార్కెట్‌లో పేరున్న ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో కరీంనగర్‌ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు చోటు దక్కింది. ఈ ఏడాది మార్చిలో ఆన్‌లైన్‌లో ఎంపికైన నాలుగు రకాల వస్తువులను జిల్లా మెప్మా కార్యాలయంలో సదరు సంస్థ ప్రతినిధులు ఆ వస్తువుల ఫొటోలు, ధరలను ట్యాగ్‌ చేశారు. అందులో భాగంగా మహిళా సంఘాలు తయారు చేసిన బోటిక్‌, ఫొటో ఫ్రేంలు, ఫిలిగ్రీ, హాండ్లూమ్స్‌ వస్తువులను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే కొన్ని అమ్మకాలు చేశారని, ఆర్డర్లు వస్తున్నట్లుగా మెప్మా అధికారులు చెబుతున్నారు.

ఇక్కడి నుంచే...

కరీంనగర్‌లోని ఓ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటిక్‌ టైలరింగ్‌ ద్వారా అందమైన డిజైన్లతో కుట్టి ఇస్తుండటంతో దేశ, విదేశాల నుంచి గిరాకీ పెరిగింది. అమెరికా, నార్వే, స్విట్జర్లాండ్‌, జర్మనీ, సౌత్‌ రష్యా, అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, హైదరాబాద్‌, దిల్లీ, కేరళ తదితర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వీరికి కావాల్సిన సమయంలో కుట్టి ప్యాకింగ్‌ చేసి వారి బంధువుల ద్వారా లేదంటే కొరియర్‌ ద్వారా ఆర్డరు ఇచ్చిన డ్రెస్సులు పంపిస్తున్నారు.

వీడియోకాల్‌ ద్వారా కొలతలు

మహిళలు నచ్చిన డ్రెస్సులు, మెటిరీయిల్‌ కుట్టించుకోవడానికి టైలర్‌ దగ్గరికి వెళ్లి కొలతలు ఇచ్చి వస్తారు. అయితే ఇతర దేశాల ప్రజలు రావడానికి వీల్లేకపోవడంతో వీడియో కాల్‌ ద్వారా అక్కడి సమయానుసారంగా కొలతలు తీసుకోవడం గమనార్హం. ఎలాంటి తేడా లేకుండా వారికి ఏ సమయంలో అంటే ఆ సమయానికే అందించి ఉపాధి పొందుతున్నారు.


మొదటిసారి అమ్మకాలు ప్రారంభం -బి.రవీందర్‌, పీడీ, మెప్మా, కరీంనగర్‌

మెప్మా, పట్టణ జీవనోపాధుల కేంద్రం ద్వారా తెలంగాణలోనే మొదటిసారి అంతర్జాతీయస్థాయిలో అమ్మకాలు ప్రారంభించడం జరిగింది. మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్‌, ఆదాయ మార్గాలు పెంచేందుకు మరింత చర్యలు తీసుకుంటున్నాం.


అన్ని దేశాలకు పంపిస్తున్నాం -అరుణ, భాగ్యనగర్‌

మెప్మాలోని 11 సంఘాల్లో పని చేస్తున్న 25మంది సభ్యులు పని చేస్తున్నారు. బోటిక్‌ వస్తువులు అన్ని దేశాలకు పంపిస్తున్నాం. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కూడా తాము తయారు చేసిన డ్రెస్సులు అందుబాటులో ఉంచారు. ఆ ఆర్డర్ల ప్రకారం కుట్టి పంపిస్తాం. హైదరాబాద్‌లోని శిల్పరామంలో ఒక స్టాల్‌ ఇప్పిస్తే ఇక్కడి ఉత్పత్తులు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలి.


రుణమే పెట్టుబడి -సరళ, సప్తగిరికాలనీ

తాము పదేళ్లుగా ఫిలిగ్రీ వస్తువులు తయారు చేస్తున్నాం. హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం తయారు చేయడం జరుగుతోంది. ఇటీవల మెప్మా ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో ఫిలిగ్రీ వస్తువులు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొంగు పిన్నులు ఉన్నాయి. వంద పిన్నులు సిద్ధం చేయాలని ఆదేశించడంతో వాటిని తయారు చేసి పంపిస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని