ఆమె ..అశీసులు ఎవరికో ..?
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

ఆమె ..అశీసులు ఎవరికో ..?

మహిళా ఓట్లు కీలకం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమరంలో ఓటు విషయంలో అతివల హవా నడుస్తోంది. హోరాహోరీగా మారుతున్న ఇక్కడి పోటీలో మహిళల ఓట్లే ప్రభావం చూపే శక్తిగా మారుతోంది. దాదాపుగా అన్ని మండలాల పరిధిలో మగవారికన్నా వీరి ఓట్లే అధికంగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఆమె ఆశీస్సుల కోసం వరుస కడుతున్నారు. కచ్చితంగా తమ గుర్తుకు ఓటేయాలని విజ్ఞాపనల్ని మహిళా లోకానికి వినిపిస్తున్నారు. ఉద్యమ, రాజకీయ చైతన్యంతోపాటు అన్ని రంగాల్లో ఇక్కడి మహిళలు సత్తా చాటుతున్నారు. పోటీదారుల విజయావకాశాల్ని మార్చగలిగే సత్తా ఉండటంతో వారి అండదండల కోసం అందరూ ప్రాధేయపడుతున్నారు. ప్రచార పర్వంలోనూ వీరికి హామీల జల్లును పలు పార్టీల నేతలు గుప్పిస్తున్నారు.

నిర్ణయాత్మక శక్తిగా..

ఇక్కడి నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాల్లో వీరికి ఓటు హక్కు రూపంలో ప్రాధాన్యత అధికంగా ఉంది. అందుకనే ప్రధాన పార్టీలన్ని వీరి ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకోవాలనే ఎత్తుగడల్ని చేతల్లో చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటింగ్‌లో పాల్గొనే విషయంలో వీరే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అందుకని వీరి ఓటు కీలకమనేలా ఎక్కువ ఏ ఊళ్లో ఎన్ని ఓట్లు వీరివి ఉన్నాయనేలా లెక్కలేసుకుంటున్నారు. నియోజకవర్గంలో 1,17,779 ఓట్లు మగవారివి ఉంటే 1,19,093 ఓట్లు మహిళలవి ఉన్నాయి. నిర్ణయాత్మకశక్తిగా మారిన ఈ మహిళల ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. వారికి అనుకూలమైన నిర్ణయాలను హామీల రూపంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇక నేతలు నిర్వహించే రోడ్‌షోలు, సమావేశాల్లో వీరి భాగస్వామ్యంతోనే కార్యక్రమాలకు కొత్త రూపు వస్తోంది. గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో వీరి ప్రమేయం, ప్రచారంలోనూ కీలకంగా మారుతోంది.

ఓట్లకు గాలం వేసేలా..

ఈ సారి ఉప ఎన్నికల కోసం తొలి ఓటును పొందిన యువతులు, పొదుపు సంఘాల మహిళలు, వృద్ధులు ఇలా కళాశాల స్థాయి విద్యార్థినుల ఓట్లకు గాలం వేసేలా నేతలు పలురకాల ప్రయత్నాల్ని చేస్తున్నారు. వారి అవసరాల్ని గుర్తించి హామీలను గుప్పిస్తున్నారు. పనిలో పనిగా స్వయం సహాయక సంఘాలకు తాయిలాల్ని ఏదో ఒక నజరానా రూపంలో అందించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రామిక మహిళలుగా, మహిళా రైతులుగా, ప్రైవేటు ఉద్యోగులుగా, వివిధ రంగాల్లో పనిచేస్తున్న నారీమణుల కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా తమ హక్కు యుక్తిని బలమైన శక్తిగా మలిచేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇక్కడి నియోజకవర్గంలో చట్టసభలకు అడుగుపెట్టే విషయంలో మహిళల ప్రాధాన్యత మొదటి నుంచి తక్కువగానే ఉంది. ఇక స్థానిక సంస్థల్లో మాత్రం తమకు అందివచ్చిన 50 శాతానికిపైగా రిజర్వేషన్‌ ఫలాలతో రాణిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు కూడా తమ ఓటు విలువను ఈ ఎన్నికల్లో వినియోంచుకోవడంతోపాటు ఇతరుల్ని ప్రభావితం చేసే విషయంలో భాగస్వామ్యమవుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని