నీడనే నమ్మని నేతలు
eenadu telugu news
Published : 21/10/2021 02:20 IST

నీడనే నమ్మని నేతలు

 పార్టీల్లో కప్పదాట్ల వ్యవహారంతో పరేషాన్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

అరె.. తమ్మీ.. ఏమనుకోకు. అసలు గీ సమయంలో ఎవరిని నమ్మాల్నో.. ఎవరిని నమ్మొద్ధో. తెలుస్తలేదు. అందుకే కోపం జేస్తున్న ఏమనుకోకు. అసలు మన పార్టీలో ఉన్నోళ్లనే పక్కాగా నమ్మే పరిస్థితి లేదు.

- ఇదీ ఓ ప్రధాన పార్టీలో నేత తీరు

రంగులు మారుతున్న రాజకీయానిదే ఈ కాలమనే రోజులివి. పైగా హోరాహోరీగా పోరు సాగుతున్న హుజూరాబాద్‌లో ఎత్తుగడలు ఆయా పార్టీల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు అనేలా నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలను మారుతుండటంతో ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. కప్పదాట్ల వ్యవహారంతో అభ్యర్థులకు ఇబ్బంది తప్పడంలేదు. పైగా వెంబడి ఉన్న నాయకుల్లో ఎవరు నిఖార్సుగా పనిచేస్తున్నారనే నమ్మకం కుదరని పరిస్థితి పలు పార్టీల నేతలకు ఎదురవుతోంది. ముమ్మరంగా సాగుతున్న ప్రచార వేళ ఇది మూడు ప్రధాన పార్టీలనూ ముప్పుతిప్పలు పెడుతోంది. జంప్‌ జిలానీల తీరు ఇంకా కొనసాగుతుండటంతో ఎవరు తమ గెలుపునకు పనిచేస్తారనే ఆందోళన అభ్యర్థులకు ఎదురవుతోంది. దీర్ఘకాలికంగా తనతో ఉన్న వారు కూడా ప్రత్యర్థి శిబిరాన్ని చేరుతుండటంతో ఏ సమాచార వ్యూహం ఎదుటి పార్టీలకు బలంగా మారుతుందనే బెంగ పలువురిలో కనిపిస్తోంది. కోవర్టుల రూపంలో పలువురి చేష్టలు మూడు పార్టీలకు ముచ్చెమటల్ని పట్టిస్తున్నాయి. అందుకనే కీలకమైన తరుణంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించేలా నేతలు ముందుకు సాగుతున్నారు. తన వెంటనే ఉన్న నీడను నమ్మేది లేదనేలా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

అసలు వ్యూహాల్ని తెలుపుతూ..

ఈ గట్టునుంచి.. ఆ గట్టుకు వెళ్తున్న పలువురు తమ రాజకీయ చతురతను పార్టీ పెద్దల వద్ద చూపించేందుకు ఇన్నాళ్ళు పక్కపార్టీలో అనుసరించిన వ్యూహాల్ని ఎంచక్కా చెప్పేస్తున్నారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపైన పెదవి విప్పుతున్నారనే చర్చ అన్ని పార్టీల నుంచి వినిపిస్తోంది. ఇదే అదనుగా పక్క పార్టీ నుంచి వచ్చిన వారినుంచి రహస్య సమాచారాల్ని సేకరిస్తూ తమ ప్రణాళికల్ని మరింత పక్కాగా కొందరు కానిచ్చేస్తున్నారు. ఇక ఆయా గ్రామాల్లో ఓ మోస్తారుగా ప్రభావం చూపే నాయకులు తమ గూటిని చేరితే వారి నుంచి ఏ ఓటర్లను ఎలా లొంగదీసుకోవాలనే ఆలోచనల్ని ఆయా పార్టీలు పంచుకుంటున్నాయి. తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుంటూ విజయావకాశాల్ని మెరుగుపర్చుకునేలా ఇలా కోవర్ట్‌ ఆపరేషన్‌లకు కొందరు తెరతీస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్తల్లో భాగంగా కొన్ని పార్టీల నేతలు పక్క పార్టీ నుంచి వచ్చిన వారిని అంత సలువుగా నమ్మడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వారితో అంటి ముట్టనట్టు ఉంటూనే తమ అనుభవంలో ఉన్న కార్యాచరణను అమలు చేస్తున్నారు. మరోవైపు ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని కాదని కొత్తవారికి ప్రాధాన్యతనిచ్చిన చోట సీనియర్‌ నాయకులు కినుక వహిస్తున్న సందర్భాలు మూడు పార్టీల్లో లేకపోలేవు. చాలా విషయాల్లో గోప్యంగా ఉంటూ నమ్మినవారికి మాత్రమే తెలియజేస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో కోవర్టులుగా వ్యవహరించిన వారి తీరుతెన్నులను తెలుసుకుని తెలివిగా వారిని ఆయా బాధ్యతలను అప్పగించకుండా తప్పించుకుంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని