ప్రసవం ఆలస్యమై బాలింత మృతి
eenadu telugu news
Published : 17/09/2021 02:13 IST

ప్రసవం ఆలస్యమై బాలింత మృతి

జిల్లా ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

బాధ్యులైన వైద్యులపై కేసు నమోదు

అనూష (పాతచిత్రం)

పెద్దపల్లి, న్యూస్‌టుడే: పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఆలస్యంగా శస్త్రచికిత్స చేయడంతో మృతి చెందిన ఘటన పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో విషాదం నింపింది. సకాలంలో వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేశారంటూ మృతురాలి బంధువులు, రెండు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు వైద్యులపై కేసు నమోదు చేశారు.

పెద్దపల్లి ఎస్సై రాజేశ్‌ కథనం ప్రకారం మండలంలోని పెద్దబొంకూరు గ్రామానికి చెందిన మిట్లపల్లి అనూష(26), శ్రీకాంత్‌ దంపతులకు ఇప్పటికే కూతురు ఉంది. రెండోసారి గర్భం దాల్చిన అనూషకు బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో పెద్దపల్లి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు గురువారం ఉదయం పురుడు పోస్తామనే ఉద్దేశంతో నొప్పులు తగ్గేందుకు మందులిచ్చారు. కాగా రాత్రి 11 గంటల సమయంలో నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాన్పు ఆలస్యం కావడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో అనూష అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లాలన్న వైద్యుల సూచనతో అక్కడికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం కరీంనగర్‌ ఆసుపత్రిలో అనూష మృతి చెందింది.

రెండు గ్రామాల ప్రజల ఆందోళన

ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె మృతి చెందిందని, బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు, పెద్దబొంకూరు, ముత్తారం(మృతురాలి పుట్టిన ఊరు) గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై రాజేశ్‌ అక్కడికి చేరుకొని పరిస్థితి చేయిదాటకుండా బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

నలుగురిపై కేసు నమోదు

ప్రసవం కోసం వచ్చిన అనూషకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహించిన వైద్యులు రుక్మిణి, మత్తు వైద్య నిపుణులు కృష్ణారెడ్డి, ఆస్పత్రి పర్యవేక్షకులు వాసుదేవరెడ్డి, డ్యూటీ నర్సుపై మృతురాలి తండ్రి దండ శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్‌ తెలిపారు.

విచారణకు కలెక్టర్‌ ఆదేశం

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ స్పందించారు. గర్భిణికి వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై గోదావరిఖని ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులతో విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని