పల్లెల్లో టీకాల పరంపర
eenadu telugu news
Published : 17/09/2021 02:13 IST

పల్లెల్లో టీకాల పరంపర

ఒక్కరోజే రికార్డు స్థాయిలో 51వేలమందికిపైగా

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

టీకా కోసం వరుసలో నిలబడిన తీరు..

కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం అందించే టీకాల విషయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జోరు పెరిగింది. గడిచిన ఎనిమిది నెలలుగా సాగుతున్న ప్రక్రియలో గురువారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,804 మందికి టీకాను వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది వేసి రికార్డును సృష్టించారు. ముఖ్యంగా 18 ఏళ్లపైబడిన అందరికి టీకాలను వేయాలనే సంకల్పాన్ని శరవేగంగా కొనసాగిస్తున్నారు. రెండో డోసుతోపాటు మొదటి డోసును పెంచి వందశాతం లక్ష్యం దిశగా అడుగులేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జిల్లాకేంద్రంతోపాటు ప్రాంతీయ ఆస్పత్రిలకే పరిమితం అయిన కేంద్రాల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. పైగా ఆయా గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలతోపాటు ప్రతి పంచాయతీ కార్యాలయం వద్ద వ్యాక్సినేషన్‌ను కొనసాగించారు.

18.46లక్షలకుపైగా..

జగిత్యాల జిల్లాలో 4,08,473 డోసుల్ని ఇప్పటి వరకు వేశారు. ఇందులో మొదటి డోసును 2,94,728 మంది వేసుకోగా రెండో టీకాను 1,13,745 మంది అందుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా టీకాల జోరు కనిపించింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ శరవేగంగా జరుగుతున్న జిల్లాల్లో ఆరోస్థానంలో ఈ జిల్లా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ 6,83,242 మంది ముందుకొచ్చారు. ఇందులో 4,85,259 మంది మొదటి దఫా, 1,97,983 మంది రెండో దఫా తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తంగా 4,28,371 మంది డోసులు వేసుకున్నారు. తొలి టీకాను 3,26,362 మంది తీసుకోగా.. మలి టీకాను 1,02,009 మంది వేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదట్లో నింపాదిగా ప్రక్రియ జరగగా ఇటీవల మాత్రం వేగం పెరిగింది. దీంతో ఇప్పటి వరకు ఈ జిల్లాలో 3,26,588 మంది టీకాలు అందుకోగా మొదటిది 2,42,549మంది రెండోది కేవలం 84,039 మంది అందుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు మొత్తంగా 18,46,674 మంది సూదిమందును పొందారు. ఇందులో మొదటి డోసు 13,51,898 మంది, రెండోది 4,94,776 మంది తీసుకున్నారు.

ప్రజలందరూ టీకా తీసుకోవాలి

ప్రజలందరూ వ్యాక్సిన్‌ తీసుకొని కొవిడ్‌ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ కోరారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీరోడ్డులోని వైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని మేయర్‌ సునీల్‌రావుతో కలిసి పారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు 58శాతం టీకా పూర్తయిందని...త్వరలోనే వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. 18ఏళ్లు పైబడిన వారంతా టీకా తీసుకోవాలని, మొదటి డోసు తీసుకున్న వారు రెండోడోసు తీసుకోవాలని తెలిపారు. కరీంనగర్‌ నగరపాలికతో పాటు కొత్తపల్లి, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలో 2 కోట్ల వ్యాక్సినేషన్‌ పూర్తయిన సందర్భంగా కలెక్టర్‌ కర్ణన్‌, మేయర్‌ సునీల్‌రావు కేకు కోశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి కమిషనర్‌ గరిమ అగ్రవాల్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జువేరియా, డిప్యూటీ కమిషనర్‌ త్రియంబకేశ్వర్‌, కార్పొరేటర్‌ పిట్టల వినోద, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని