రెండేళ్లలో పనులు చేసి చూపిస్తాం
eenadu telugu news
Published : 17/09/2021 02:13 IST

రెండేళ్లలో పనులు చేసి చూపిస్తాం

హుజూరాబాద్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ భవనానికి

భూమి పూజ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే 17 ఏళ్లలో చేయలేని పనులను రానున్న రెండేళ్లలో పూర్తిచేసి చూపిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ భవనానికి గురువారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం వడ్లూరి బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఒకేరోజు హుజూరాబాద్‌, జమ్మికుంటలో భవనాలకు భూమి పూజ చేశామని తెలిపారు. హుజూరాబాద్‌లో ఎకరం స్థలంలో రూ.కోటి వ్యయంతో ఆచార్య జయశంకర్‌ భవన్‌ పేరుతో భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఆరుసార్లు ఈటల రాజేందర్‌ను గెలిపించారని, ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌కు అవకాశమిచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఈటల రాజేందర్‌ ఓటుకు రూ.30వేలు ఇస్తామంటున్నాడట.. డబ్బులిచ్చే బదులు గ్యాస్‌,పెట్రోలు,డీిజిల్‌ ధరలు తగ్గించేలా చూస్తే మంచిదని సూచించారు. కల్యాణలక్ష్మీ పథకం దండగ అన్న ఈటల రాజేందర్‌కు ఓటేస్తే ప్రజలే నష్టపోతారన్నారు. త్వరలోనే విశ్వబ్రాహ్మణులు శుభవార్త వింటారని, తెలంగాణ తొలి స్పీకర్‌ పదవి మధుసూదనాచారికి దక్కిందని, ఇలాంటి అవకాశమే భవిష్యత్తులో మళ్లీ వస్తుందన్నారు. మాజీ స్పీకర్‌ మధుసూదనచారి మాట్లాడుతూ సమైక్యపాలనలో విశ్వకర్మల సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి స్పీకర్‌ పదవి తనకు అప్పగించి తమ జాతి గౌరవాన్ని నిలబెట్టారన్నారు. సమావేశంలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డి, విశ్వకర్మల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలచారి, నాయకులు గణేశాచారి, సంతోషాచారి, సూరాచారి, నిర్మల, కవిత, పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని