నమ్మించి.. అఘాయిత్యాలకు తెగించి
eenadu telugu news
Updated : 17/09/2021 10:45 IST

నమ్మించి.. అఘాయిత్యాలకు తెగించి

తెలిసినవారే బలి తీసుకుంటున్నారు

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పోక్సో కేసులు

వరుస సంఘటనల్లో బలవుతున్న చిన్నారులు

న్యూస్‌టుడే, గోదావరిఖని

హైదరాబాద్‌లో ఓ బాలికపై హత్యాచారం.. రెండేళ్ల క్రితం వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అఘాయిత్యం.. తాజాగా జగిత్యాల జిల్లాలో అయిదేళ్ల బాలికపై ఇంటర్‌ విద్యార్థి అత్యాచారం.. ఆభం శుభం తెలియని పిల్లలే లక్ష్యంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఈ హత్యాచారాలు సమాజంలో కలకలం రేపుతున్నాయి.. చాక్లెట్‌ కొనిస్తానని.. కలిసి ఆడుకుందామని.. చదువుకుందామని.. ఇంట్లో టీవీ చూద్దామని.. ఇలా తెలిసినవారే తీసుకెళ్లి బలి తీసుకుంటున్నారు. అసలు బాలికలకు భద్రత ఉందా..? సమాజంలో ఆడపిల్ల పరిస్థితి ఇలాగే ఉంటుందా..? ఎక్కడ ఏ మృగాడు పొంచి ఉన్నాడోనని భయాందోళన పెరుగుతోంది.

చిరుప్రాయంలో ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తించలేని ఎంతో మంది చిన్నారులు కామాంధుల అఘాయిత్యాలకు బలవుతున్నారు. తెలిసినవారే నమ్మించి బలితీసుకుంటున్నారు.. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి.. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కఠిన చట్టాలు, శిక్షలు ఉన్నా ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటుచేసుకోవడం శోచనీయం.. పెరుగుతున్న సాంకేతిక, సెల్‌ఫోన్‌, సినిమాల్లో ఆశ్లీలత, మందు, మాదకద్రవ్యాల ప్రభావంతో బాలలు, యువకులు పెడదారిపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పదుల సంఖ్యలో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. నిందితులను జైలుకు పంపుతున్నా ఎక్కడా దురాగతాలు ఆగడం లేదు.

ఆరుబయట అప్రమత్తం..

చిన్నారులు ఎక్కువగా ఆరుబయట ఆడుకుంటారు. వారిని వదిలేసి తల్లిదండ్రులు ఎవరి పనిలో వారు నిమగ్నం కాకుండా తరచూ కనిపెడుతూ ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తి వస్తే అప్రమత్తం కావాలి. చిన్నారులతో ఎవరైన చనువుగా ఉన్నట్లు కనిపిస్తే వారి చేష్టలను గమనించాలి.. తెలిసిన వారైనా తేడాగా కనిపిస్తే గట్టిగా హెచ్చరించాలి. ఇటీవల కాలంలో ఎక్కువగా చిన్నారులు ఆడుకుంటున్న ప్రాంతం నుంచే కనిపించకుండా పోతున్నారు. అపహరణకు గురవుతున్న బాలికలు అత్యాచారానికి.. హత్యకు గురవుతున్నారు. ఇటీవల కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు నడవకపోవడంతో ఇళ్ల వద్దనే ఉంటున్న చిన్నారులు ఇంటికి సమీప ప్రాంతాల్లో ఆడుకోవడానికి వెళ్తున్నారు. అలాంటి సమయంలో బాలికలపై కన్నేస్తున్న కామాంధులు కనికరం లేకుండా దారుణానికి ఒడిగడుతున్నారు.

అంతర్జాలం, మాదక ద్రవ్యాల ప్రభావం

పదేళ్ల పిల్లాడి నుంచి వృద్ధుల వరకు చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది.. అందులో ఏం చూస్తున్నారో.. ఎవరి పర్యవేక్షణా ఉండటం లేదు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట ఫోన్‌ మరింత చేరువైంది. కొంతమంది చెడువైపు ఆకర్షితులై చిన్న వయసులోనే పెడదోవ పడుతున్నారు. వాటి ప్రభావంతో వికృత చేష్టలకూ వెనుకాడటం లేదు. పాఠశాల, కళాశాల విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి అవసరం. విద్యార్థులు యూట్యూబ్‌, బ్రౌజర్లు వాడకుండా లాక్‌ చేయడం ఉత్తమం.. వారికి ఫోన్‌ ఏ మేరకు అవసరమో వివరించి కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. యుక్తవయసు పిల్లలు మందు, మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నారు. అర్ధరాత్రి పార్టీలు, వేడుకల పేరిట పెడదోవ పడుతున్నారు. ఇంటి పక్కన అల్లరి చిల్లరగా తిరిగే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అవసరమైతే పోలీసులకు చెప్పడానికీ వెనకాడొద్ధు.

రామగుండం : హైదరాబాద్‌లో హత్యాచారానికి గురైన చిన్నారికి నివాళులు

పోక్సో కేసులు పెడుతున్నా..

చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై పోక్సో కింద కేసులు నమోదు చేస్తున్నారు. దీన్ని ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేపడుతున్నారు. సాధ్యమైనంత తొందరగా కేసు విచారణ ముగించి కోర్టుకి నివేదిస్తున్నారు. అయితే కోర్టుల్లో కేసులపరంగా జాప్యం జరగుతుండటంతో నేరస్థులకు శిక్షలు పడటంలో జాప్యం జరుగుతుంది. సంచలనం సృష్టించిన కేసుల్లో కొన్ని వేగంగా విచారణ జరుగుతున్నాయి. వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితునికి తొందరలోనే శిక్ష పడింది. అంత వేగంగా మరెక్కడ విచారణ పూర్తి కావడం లేదు. దీంతో నేరస్థుల్లో భయం లేకుండా పోయింది.


మత్తులో ఉన్మాదం

- విశ్వమేధి, మానసిక వైద్య నిపుణులు●

* చాలా మంది మత్తులో ఉన్మాదులుగా మారుతారు. ఏదో ఒక రకం మత్తులో ఉన్న సమయంలో లైంగిక వాంఛ పెరుగుతుంది. ముఖ్యంగా యుక్త వయసులో ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో చెడు అన్న భావన రాదు.

* టీనేజ్‌లో శరీరంలో మార్పు వస్తుంది. దాంతో పాటు మానసిక స్థితి కూడా మారుతుంది. ఆ సమయంలో పెద్దలు వారిని గమనిస్తూ మంచి వైపు సూచనలు చేయాలి.

* కొంత మంది పెద్దవాళ్లు కూడా లైంగిక వాంఛ తీర్చుకోవడానికి చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరంతా మత్తు పదార్థాలు తీసుకోవడంతో విచక్షణ కోల్పోతున్నారు.

* ఒక సంఘటన జరగడానికి అనేక రకాల కారణాలుంటాయి. ఎక్కువగా మత్తుకు బానిసైన వారు.. యవ్వనంలోకి అడుగుపెడుతున్న నవ యువకుల్లో వచ్చే శరీర మార్పులతో లైంగిక దాడులకు పాల్పడుతుంటారు.

* మన చుట్టు ఉండేవారే ఎక్కువగా ఇలాంటి సంఘటనలు చేస్తుంటారు. నమ్మకంగా ఉంటూ అవకాశం కోసం చూస్తుంటారు. వారిని గమనించాలి.

* అప్రమత్తంగా ఉంటే ఇలాంటి సంఘటన జరగకుండా బయటపడే అవకాశం ఉంటుంది.


ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం..

- సత్యనారాయణ, కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంట్లో పెద్దలు ఉంటే.. వారు పిల్లలను గమనిస్తూ బందుత్వాలు.. బాంధవ్యాలు చెప్పేవారు. సమాజంలో గౌరవంగా జీవించడం.. కుటుంబ నేపథ్యాన్ని ఎప్పటికప్పుడు వివరించడంతో సమాజం పట్ల అవగాహన ఉండేది. ప్రస్తుతం అలాంటివి లేకుండా పోయాయి. ఇంటర్నెట్‌.. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత అశ్లీలత పెరిగింది.. యువత ఇక్కడే చెడిపోతున్నారు. తల్లిదండ్రులు వారిని పెద్దగా గమనించడం లేదు. వారి అదుపు లేదు. దీంతోనే చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేస్తున్నాం. విచారణలు జరుగుతున్నాయి. వెంటనే శిక్షలు పడేలా కోర్టులకు ఆధారాలు అందజేస్తున్నాం. అయినా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని