
భోగి వైభవం.. ఇంటింటా ఆనందం
ఉమ్మడి జిల్లాలో ఘనంగా వేడుకలు
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంపై యువతుల ఉత్సాహం
భోగి మంటలు.. రంగుల హరివిల్లులు.. హరిదాసు కీర్తనలు..గంగిరెద్దుల విన్యాసాలు.. ఆత్మీయుల పలకరింపులు.. నింగిలో ఎగిరిన గాలిపటాలతో భోగి పండుగ బుధవారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరిగింది. పల్లె పల్లెలో.. పట్టణ.. నగర వీధులన్నీ రంగురంగుల రంగవల్లులు ఇళ్ల లోగిళ్లకు సప్తవర్ణశోభను తీసుకొచ్చాయి. యువతులు, మహిళలు వేకువ జామునే లేచి కళ్లాపి చల్లుకొని తమ సృజనకు పదును పెట్టి ముగ్గులు వేస్తే కుటుంబీకులు ఇంట్లోని పాతవస్తువులు తీసుకొచ్చి కూడళ్లలో పేర్చి భోగిమంటలు వేసి ఆటాపాటలతో గడిపారు. జాగృతి సంస్థ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేకువ జామునే భోగి మంటలతో పాటు పండుగ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. పిల్లలకు భోగిపళ్లు పోశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హరిదాసుల సంకీర్తనలు సందడి చేస్తే.. గంగిరెద్దుల విన్యాసాలు కనువిందు చేశాయి.
-కరీంనగర్ సాంస్కృతికం, న్యూస్టుడే